epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘వీబీ జీ రామ్ జీ’తో గ్రామీణాభివృద్ధి: నెల్లూరి కోటేశ్వర రావు

కలం, ఖమ్మం బ్యూరో: దేశవ్యాప్తంగా గ్రామాల సమగ్రాభివృద్ధికి ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ఉపయోగపడుతుందని బీజేపీ ఖమ్మం జిల్లా (BJP Khammam) అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావు అన్నారు. ఆదివారం వైరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా ఉపాధి హామీ పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, అన్నదాతకు, కూలీకి ఇబ్బంది లేకుండా ‘వీబీ రామ్​ జీ’ చట్టాన్ని కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం గురించి కాంగ్రెస్, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిదినాలు ఉంటే, కొత్త చట్టంతో అవి 125 రోజులకు పెరిగాయన్నారు. నిర్ణీత సమయంలోగా ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భత్యం ఇవ్వడమే కాకుండా, వేతనాల చెల్లింపులో జాప్యం జరిగితే అదనపు పరిహారం ఇచ్చేలా చట్టంలో కఠిన నిబంధనలు చేర్చినట్లు వెల్లడించారు.

గ్రామాల్లో ఏ పని చేయాలి? నిధులు ఎలా ఖర్చు చేయాలనేది ఇకపై గ్రామ సభలు, పంచాయతీలే నిర్ణయిస్తాయన్నారు. 50 శాతం పనులను నేరుగా పంచాయతీల ద్వారానే అమలు చేస్తారని చెప్పారు. విత్తనాలు వేసేటప్పుడు, నాట్లు, కోతల సీజన్​లో కూలీలకు డిమాండ్ ఎక్కువని, ఆ సమయంలో రైతులకు అండగా ఉండేందుకు 60 రోజుల పాటు పథకానికి విరామం ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు. కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా, గ్రామీణ మహిళల నైపుణ్యాభివృద్ధికి ఈ చట్టం పెద్దపీట వేసిందన్నారు. స్వయం సహాయక సంఘాల కోసం షెడ్లు, సంతల ఏర్పాటు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు వంటివి చేపట్టి, మహిళలు గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

అవినీతికి తావు లేకుండా బయోమెట్రిక్ హాజరు, జిఐఎస్ ఆధారిత ధ్రువీకరణ వంటి అత్యాధునిక సాంకేతికత ఉపయోగిస్తున్నామని, సోషల్ ఆడిట్ తప్పనిసరి చేశామని అన్నారు. ఈ పథకానికి వెన్నెముకగా నిలిచే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల నిర్వహణ వ్యయాన్ని 6 నుంచి 9 శాతానికి పెంచామని, తద్వారా వారికి సకాలంలో గౌరవ వేతనం అందుతుందని హామీ ఇచ్చారు. ఈ చట్టంపై కాంగ్రెస్ ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ చట్టం గురించి ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామని, విపక్షాల కుట్రలను తిప్పికొడతామని బీజేపీ ఖమ్మం జిల్లా (BJP Khammam) అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>