కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాకు అజేయ రక్షగా ఉంటున్నారని ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేసిన వైబ్రంట్ గుజరాత్ రీజినల్ సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొని మాట్లాడారు. ఇండియాలో నేడు చూస్తున్న వృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహకాలు, ఆశ, ఆత్మవిశ్వాసాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇండియా వనరుల నుంచి పనితీరు చూపించే దిశగా మారుతోందని.. అనుచరించే స్థాయి నుంచి ప్రపంచ శక్తిగా ఎదిగిన కాలాన్ని మోడీ యుగంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు ముకేశ్. మోడీ నాయకత్వం వల్లే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒడిదుడుకులను తట్టుకుని మన దేశం ప్రశాంతంగా ఉందన్నారు అంబానీ.
గుజరాత్ రాష్ట్రంతో రిలయన్స్ సంస్థకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. గుజరాత్ లో గత ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని.. రాబోయే ఐదేళ్ల కాలంలో దీన్ని రూ.7లక్షల కోట్లకు పెంచుతామని ప్రకటించారు ముకేశ్ అంబానీ (Mukesh Ambani). దాని వల్ల యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. ఇప్పటి వరకు గుజరాత్ లో తమ కంపెనీనే అతిపెద్ద ఇన్వెస్టర్ గా ఉందని స్పష్టం చేశారు. 2036లో ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నానికి రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు చెప్పారు. అందులో భాగంగా గుజరాత్ ప్రభుత్వంతో కలిసి వీర్ సావర్కర్ మల్టీ-స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముకేశ్ అంబానీ వివరించారు.


