epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మన దగ్గరా ‘వంతారా’ జూ పార్కు

కలం డెస్క్ : గుజరాత్‌లో ఉన్న ‘వంతారా’ (Vantara Zoo Park) తరహా జూ పార్కు మన దగ్గరకూ రానున్నది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం అవగాహనా ఒప్పందం కుదిరింది. గ్లోబల్ సమ్మిట్‌లో తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆ జూ పార్కు ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్కు కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నది.

ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ ఒప్పందం కుదరడంతో త్వరలోనే స్వయంగా గుజరాత్‌లోని వంతారా జూ పార్కును సందర్శిస్తానని ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో నెలకొల్పబోయే వంతారా తరహా జూ పార్కు నిర్మాణానికి ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. గుజరాత్ జూ పార్కులో జంతువులకు కల్పిస్తున్న అన్ని మౌలిక సదుపాయాలను ఫ్యూచర్ సిటీ పార్కులోనూ కల్పించాలని సూచించారు. జంతువులకు సేవ చేసే ఉద్దేశంతో నెలకొల్పిన వంతారా జూ పార్కు ఇక్కడ కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుందన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు.

నెలాఖరుకు గుజరాత్ వంతారా జూ సందర్శన :

గుజరాత్‌లోని వంతారా జూ పార్కు (Vantara Zoo Park) నిర్వహణ గురించి అధ్యయనం చేయడానికి తెలంగాణ అటవీ శాఖ తరఫున పీసీసీఎఫ్ నేతృత్వంలో గతేడాది అక్కడకు వెళ్ళింది. మొత్తం తొమ్మిది మంది ప్రతినిధులు ఆ పార్కుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. తెలంగాణలో సైతం ఇలాంటి పార్కును నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఇలాంటి జూ పార్కును నెలకొల్పడానికి రంగారెడ్డి జిల్లాలోని కురుమిద్ద, కడ్తాల్, తాడిపర్తి గ్రామాల్లోని అటవీ భూముల వివరాలను ప్రస్తావించి అనుకూల పరిస్థితులను ఆ నివేదికలో ప్రస్తావించారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఈ నెల చివర్లో ఆ పార్కును సందర్శిస్తానని వంతారా జూ పార్కు ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Read Also: ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల బహుమతి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>