కలం, వెబ్‌డెస్క్: ఫార్మాట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. సీనియర్, జూనియర్ టోర్నీ అనే తేడా లేకుండా చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి ధనాధన్ ఆటతో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దక్షిణాఫ్రికా అండర్–19తో సోమవారం జరిగిన రెండో యూత్ వన్డేలో సిక్సర్ల సునామీ సృష్టించి, యువ భారత్‌కు విజయం సాధించిపెట్టాడు. దక్షిణాఫ్రికాలోని బెనోయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ సఫారీ జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో జేసన్ రోవెల్స్ సెంచరీ (114; 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించాడు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 4, ఆర్ఎస్ అంబరీష్ 2 వికెట్లు తీశారు. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులకు కుదించారు. వైభవ్ సూర్యవంశీ సిక్సర్లతో వీరవిహారం చేసి అర్ధ సెంచరీ (68; 1 ఫోర్, 10 సిక్స్‌లు) సాధించడంతో భారత్ 23.3 ఓవర్లలో 176/2 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అరోన్ జార్జ్(20), వేదాంత్ త్రివేది(31 నాటౌట్), అభిజ్ఞాన్ కుందు(48) రాణించారు. మైఖేల్ క్రూయిస్కమప్ 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో సిరీస్ భారత్ సొంతమైంది. ఆఖరి వన్డే ఇదే మైదానంలో జనవరి 7న జరగగనుంది.

Read Also: ఫిబ్రవరిలో శిఖర్ ధావన్ పెళ్లి .. వధువు ఎవరంటే?
Follow Us On: Instagram


