కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ ను ఉద్దేశించి “MMC” (ముస్లిం లీగ్-మావోయిస్ట్ కాంగ్రెస్)గా అభివర్ణించడంపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (V Hanumantha Rao) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ దుర్మార్గమైన వాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముస్లింలు మనుషులు కాదా? ముస్లింలు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను “ముస్లింల పార్టీ”గా పేర్కొంటూ సామజిక విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రధాని మోదీపై హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మోదీపై తప్పుకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
మోదీ సభను చూసి ప్రజలు నవ్వుతున్నారు…
ప్రధాని మోదీ సభను చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు. మోదీ భాష చెత్తగా ఉందని, ప్రధాని మాట్లాడాల్సిన భాషేనా ? అని ప్రశ్నించారు. మోదీ చాయ్ వాలా లాగా మాట్లాడలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా అంబానీ, అదానీలతో సంబంధమున్న కోటీశ్వరుడు మోదీ అని వ్యాఖ్యానించారు. బీసీలపై మోదీకి చిత్తశుద్ధి లేదని వీహెచ్ చెప్పారు. 60 కోట్ల మంది బీసీలకు మోదీ అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే మోదీ సహాయం చేస్తారని అన్నారు.
రేవంత్ కి ఉన్న చిత్తశుద్ధి మోదీకి లేదు..
బీసీల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మోదీకి లేదని వీహెచ్ ఆరోపించారు. ఓబీసీలను కూడా కులగణనలో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీల లెక్క తీయకపోతే తమకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. మోదీలో ఇప్పటికైనా మార్పు రావాలన్నారు. పవన్ కళ్యాణ్ కల్పించుకొని బీసీ కులగణన చేయమని మోదీకి చెప్పాలని సూచించారు. ఓబీసీలను కూడా కులగణనలో చేర్చకపోతే ఎవరూ ఈ జనగణనలో పాల్గొనవద్దని ఓబీసీలకు విజ్ఞప్తి చేశారు.

