Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్రజలశక్తి మంత్రితో చంద్రబాబు భేటీ

కలం, వెబ్ డెస్క్: కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని సీఎం కోరారు.

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై వివరణ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని చంద్రబాబు కేంద్ర మంత్రికి  వివరించారు. ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. అలాగే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌కు సంబంధించిన గ్యాప్-1, గ్యాప్-2 పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు.

బనకచర్ల అనుమతులు ఇవ్వండి

అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల నీటి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా కరువు ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చని వివరించారు.

నిధులు విడుదల చేయండి

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ‘హర్ ఖేత్ కో పానీ’ కార్యక్రమాల కింద రాష్ట్రంలోని చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ, ఆధునీకరణ పనులకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలువల పూడికతీత, గట్ల బలోపేతం వంటి పనుల కోసం రూ.285 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలోని సాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>