ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కలం, ఖమ్మం బ్యూరో: పీపీసీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల‌పై హైద‌రాబాద్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఖమ్మం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పీపీసీ కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరి చేరగా ఇప్పటి వరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు ధ్రువీకరించారు. అలాగే వరిని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలీ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల తడిసిన వరిని వెంటనే కొనుగోలు చేసిన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని, జిల్లా స్థాయిలో తగినంత టార్పెలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని పీపీసీ కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. మెరుపు, వానల సమయంలో రైతులు కరెంట్ స్తంభాలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని ఉత్తమ్ (Uttam Kumar Reddy) హెచ్చరించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించి, ఎఫ్‌ఏక్యూ వరి తక్షణమే లిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఎలాంటి ఆలస్యం లేకుండా సమయానికి పూర్తి చేయాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా అవసరానికి అనుగుణంగా నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రైతులు గన్నీ బ్యాగులు తీసుకొస్తే వాటికి కూడా ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాకు 49 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మిగతా అవసరాలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి పీపీసీ కేంద్రంలో అవసరమైన నిల్వలు తప్పని సరిగా ఉండాలని ఆదేశించారు.

హమాలీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ట్రక్ షీట్లు సమయానికి జెనరేట్ చేయాలని, వరి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ట్రాక్టర్, హమాలీ చార్జీలపై పీపీసీ కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స‌పీఓ శ్రీనివాస్, డీఆర్డిఓ శ్రీరామ్, డీసీఓ, ఆర్టీఓ, వ్యవసాయ, మార్కెటింగ్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: త‌మిళ‌నాడు ఫ‌లితాల‌పై క‌విత రియాక్ష‌న్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>