కాగితాలకే పరిమితమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

కలం, నల్లగొండ బ్యూరో: బయోమెట్రిక్ ఇచ్చారు.. ఫొటోలు దిగారు.. అధికారులు చెప్పినట్టు అన్నీ చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) రావడమే తరువాయి అని నమ్మిన 447 కుటుంబాలకు మిగిలింది నిరాశే. ఒకే ఒక్క లబ్ధిదారు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నా.. ప్రభుత్వం నుంచి పైసా విదిల్చే నాథుడు లేడు. ఇదంతా పైలెట్ ప్రాజెక్టు అని ఊదరగొట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రఘునాథపాలెం గ్రామ వ్యథ.

పైలెట్ ప్రాజెక్టులో నయా పైసా రాలే..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 447 ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Houses) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి.. బయోమెట్రిక్ కూడా తీసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు (మార్కింగ్) కూడా పోశారు. అంతే.. అక్కడితో అంతా ఆగిపోయింది. గ్రామ కార్యదర్శి నేతృత్వంలో ఫొటోలు, బయోమెట్రిక్ వంటి సాంకేతిక ప్రక్రియలు పూర్తయినా… ఏడాదిగా నిర్మాణ పనులు అంగుళం కూడా ముందుకు కదలలేదు. రూపాయి కూడా విడుదల కాలేదని, తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.

మంత్రి నియోజకవర్గమే.. అయినా ఎందుకీ నిర్లక్ష్యం?

సొంత నియోజకవర్గం, అదీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దృష్టి సారించకపోవడంపై లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడిన 447 కుటుంబాలు నేడు అద్దె ఇళ్లల్లో శిథిలావస్థకు చేరిన పాత ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి, ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే నిధులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సొంతంగా కట్టుకున్నా.. రూపాయి ఇవ్వలేదు

మొత్తంలో 447 ఇళ్లల్లో పెద్దారపు హైమావతి అనే లబ్ధిదారు ఒక్కరే తన ఇంటిని అప్పులు చేసి నిర్మించుకున్నారు. అధికారులు ఆమె ఇంటి డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినా.. నేటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదు. పైలెట్ ప్రాజెక్టులో పూర్తయిన ఏకైక ఇంటికే బిల్లు రాకపోతే మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది లబ్ధిదారుల ప్రధాన సందేహం. దీనిపై తమకు మరింత స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Read Also: వినీషియస్ జూనియర్ మెరుపులు.. రియల్ మాడ్రిడ్‌కు అద్భుత విజయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>