కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా బీజేపీకి అడ్డా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇక్కడ పార్టీ శ్రేణుల పోరాటం, నాయకత్వ పటిమ కారణంగానే రాష్ట్రంలో మొదటగా కరీంనగర్ కార్పొరేషన్‌ను కమలం పార్టీ కైవసం చేసుకుందని వివరించారు. పండిట్ దీన్ దయాల్ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ తరగతులు శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ గ్యాలరీని తిలకించారు.
పార్టీ భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
బీజేపీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సూచించిన “ఏకాత్మ మానవ వాదం” సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడిందని పార్టీ శ్రేణులకు రామచందర్ రావు (Ramchander Rao) వివరించారు. దేశమే మొదటి ప్రాధాన్యం, తరువాత పార్టీ , చివరన వ్యక్తి అనే భావనతో బీజేపీ సిద్ధాంతం ఉంటుందన్నారు. శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు పార్టీ సిద్ధాంతం, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి కృషి చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా బెంగాల్ రాష్ట్రంలో గెలిచి బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. బెంగాల్ గడ్డపైనే పురుడుపోసుకున్న జనసంఘ్ వ్యవస్థాపకుడు శామా ప్రసాద్ ముఖర్జీకి ఇది నిజమైన ఘన నివాళులు అర్పించినట్లయిందని వివరించారు.
దేశమంతటా ఎన్డీఏ పాలన..
దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పరిపాలన తీరు పట్ల ప్రజలు విసిగిపోయారని రామచందర్ రావు విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. మోదీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. మూడు రాష్ట్రాలు మినహా దేశమంతా ఎన్డీఏ పాలనే కొనసాగుతుందన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. యుద్ధ కారణంగా అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 80 శాతం ధరల పెరుగుదల ఉంటే , మూడు శాతం మాత్రమే మన దేశంలో ధరల పెంపుదల జరిగిందనే విషయాన్ని గ్రహించాలన్నారు.
కాంగ్రెస్ అన్నింట్లో వైఫల్యం..
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింట్లో వైఫల్యం చెందిందని రామచందర్ రావు మండిపడ్డారు. కనీసం ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఓ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన ప్రజలకు అర్థమైందని.. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై రాష్ట్ర నాయకులు అయ్యంగారు ప్రభాకర్ రెడ్డి , దేవకి వాసుదేవ రావు, అల్జాపూర్ శ్రీనివాస్, బండారి శాంతి కుమార్, రాణి రుద్రమ మాట్లాడారు. శిక్షణ తరగతుల్లో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బోడిగే శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కళ్లెం వాసుదేవ రెడ్డి , ప్రశిక్షణ కమిటీ బాధ్యులు గుజ్జ శ్రీనివాస్, ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి, చింతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

