కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికా (US Iran) మధ్య కొనసాగుతున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. హర్మూజ్ జలసంధి వైపు ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. దీనికి ప్రతిచర్యగా అమెరికా వైమానిక దళం ఇరాన్ తీరప్రాంత పర్యవేక్షణ రాడార్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆకస్మిక దాడులతో ఈ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసే ప్రమాదం ఏర్పడింది.
ఈ సైనిక చర్యను అమెరికన్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ల వల్ల ఆ ప్రాంతంలోని సముద్ర రవాణాకు మరియు నౌకలకు తక్షణ ముప్పు పొంచి ఉందని, అందుకే వాటిని కూల్చివేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నిరోధించేందుకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. హర్మూజ్ జలసంధిలోని ఒక ద్వీపంతో పాటు పలు తీరప్రాంత రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు నిర్వహించినట్లు పేర్కొంది.
ఈ వారంలో కువైట్ ప్రధాన విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, ఒకరు మరణించారు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటనతో కువైట్ ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఆ దాడికి ప్రతికారంగానే అమెరికా ఇప్పుడు తాజా సైనిక చర్యకు దిగింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం సానుకూలంగా స్పందించారు. విస్కాన్సిన్‌లో జరిగిన ఒక రైతు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌తో పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా లేదా కఠినమైన చర్యల ద్వారా అయినా సరే ఈ సమస్యను అమెరికా చాలా త్వరగా, బలంగా పరిష్కరిస్తుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.

