కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, మణుగూరు పీవీ కాలనీలో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకున్నది. సాంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొడుతూ, సమాజానికి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసింది. అంబేద్కర్ ఆశయాలను ఊపిరిగా మలచుకుని ఓ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
సింగరేణిలో ఫిట్టర్‌గా ఉద్యోగం చేస్తున్న చెలికాని ఫ్రాన్సిస్ – సరిత పెద్దకుమారుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు వేర్పుల శేషయ్య మనువడైన సుధాకర్, అంకితల వివాహ వేడుక నూతన సంప్రదాయానికి తెర తీసింది. మణుగూరు ఏరియా అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్’ ఎదుట ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం చెంత ఈ జంట ఒక్కటైంది.
చెలికాని ఫ్రాన్సిస్ కుటుంబంలో నేడు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు బాబాసాహెబ్ కల్పించిన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల వల్లే ఈ రోజు తమ కుటుంబం ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకుందనే సత్యాన్ని ఆ కుటుంబం మరచిపోలేదు. “మేము అనుభవిస్తున్న ఈ గౌరవం, ఈ స్థాయి కేవలం అంబేద్కర్ భిక్షే” అనే పరమ సత్యాన్ని చాటుతూ, నవదంపతులు తమ వైవాహిక జీవితాన్ని బాబాసాహెబ్ ఆశీస్సులతో ప్రారంభించడం విశేషం.

