కలం, వెబ్ డెస్క్: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రబీ సీజన్ కోసం రూ.62,370 కోట్ల విలువైన ఎరువులను సబ్సిడీ రూపంలో అందించాలని కేంద్ర కేబినెట్ (Union Cabinet) నిర్ణయించింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేబినెట్ పలు రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముద్ర యోజన కింద యువ ఎంట్రప్రెన్యూర్ల కోసం రూ.5 వేల కోట్ల రుణాలు అందించబోతుంది. స్టాండప్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళ ఎంట్రప్రెన్యూర్ల కోసం రూ.4,111 కోట్ల క్రెడిట్ గ్యారంటీ కూడా మంజూరు చేసింది. నోయిడా, గ్రేటర్ నోయిడాను కలిపే 8.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.
భారీ మ్యూజియం నిర్మాణానికి..
భారత సాంస్కృతిక వైభవాన్ని మరింత ఘనంగా చాటేలా రూ.3,230 కోట్లతో యుగే యుగీన్ భారత్ మ్యూజియాన్ని కూడా నిర్మించాలని కేంద్ర కేబినెట్ (Union Cabinet) నిర్ణయించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియంగా నిలవబోతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న నార్త్, సౌత్ బ్లాక్‌ల్లో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం ఇక్కడ ఉన్న కార్యాలయాలను ఇప్పటికే కర్తవ్య భవన్, సేవా తీర్థ్ ప్రదేశాలకు తరలించారు. భారత వారసత్వ, సంస్కృతి, విశిష్టమైన నాగరికత ప్రయాణాన్ని గుర్తు చేసేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఈ మ్యూజియానికి సమీపంలోనే మెట్రో స్టేషన్ కూడా నిర్మించబోతున్నారు. నార్త్, సౌత్ బ్లాక్‌ల నిర్మాణ విశిష్టతను కాపాడుతూనే కొత్త మ్యూజియాన్ని అక్కడ జాగ్రత్తగా నిర్మించాలని కేంద్ర కేబినెట్ ఆదేశించింది.
Also Read : ఆ కలెక్టర్‌ను కోర్టులో హాజరుపర్చాలి: హైకోర్టు కీలక ఆదేశాలు!
Follow Us On : WhatsApp

