కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మైనార్టీ సంక్షేమం (Minority Welfare) విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్రం హోం మంత్రి అమిత్ షా మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోరని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారా భవన్ లో బుధవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం & మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారని కొనియాడారు. యూనివర్సిటీలు, కాలేజీలు స్థాపించి ఎంతో మంది ఇంజినీర్లు కావడానికి కృషిచేశారని అన్నారు. ఆయన తెచ్చిన ఐటీఐలను ప్రస్తుతం తాము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు.
ఓల్డ్ సిటీలో మాత్రం మెట్రోను నిర్మించలేదు..
మైనార్టీలకు వచ్చే స్కాలర్షిప్లను మోదీ రద్దు చేశారని.. స్కాలర్ షిప్ రద్దుతో మైనార్టీ విద్యార్థులకు (Minority Student) అన్యాయం చేశారని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం హయాంలో స్పోర్ట్స్ లో రాణిస్తున్న సిరాజుద్దీన్, నిఖత్ జరీన్ లను డీఎస్పీలను చేశామని చెప్పారు. హైదరాబాద్ లో 70 కిలోమీటర్ల మెట్రో నిర్మించారని.. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం మెట్రోను నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఓల్డ్ సిటీ మెట్రో భూ సేకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. మరో రెండు నెలల్లో మెట్రో పనులు ప్రారంభించబోతున్నామని అన్నారు. మైనారిటీల్లో చాలామంది స్కిల్డ్ యూత్ ఉన్నారని.. యువత కోసమేతమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీని కాపాడే బాధ్యత తాను తీసుకున్నానని తెలిపారు. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అంటూ వ్యాఖ్యానించారు.
మూసీ రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు (Musi Rejuvenation) శ్రీకారం చుట్టిందని.. ఎవరేం చేసినా, ఎవరు అడ్డుకున్నా మూసీ రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తామని మరోసారి సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణతో యువతకు ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలదని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఒక్క దరఖాస్తు ఇస్తే.. ప్రజల సమస్యలు తీరిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయింది.. కవిత ఫైర్
Follow Us On: Youtube

