కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో (Dilsukhnagar) నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డప్పు చప్పుళ్లతో ఆందోళన బాట పట్టారు. 5 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం నుంచి లీకులు వస్తున్న నేపథ్యంలో.. పోస్టుల సంఖ్యను 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 5 వేల పోస్టుల వలన నిరుద్యోగులకు న్యాయం జరగదని.. గతంలో ఒకేసారి 17 వేల పోస్టులు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్డుపై మెరుపు ధర్నా చేపట్టడంతో దిల్‌సుఖ్‌నగర్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి, వారిని వెంటనే పక్కకు తప్పించారు. ఈ సందర్భంగా కొందరిపై చేయి చేసుకున్నట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గత మూడు రోజులుగా నిరుద్యోగులు వరుస ఆందోళనలు చేపడుతుండటం గమనార్హం.

