కలం, వెబ్‌డెస్క్: చైనా (China)లోని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake)రావడం కలకలం రేపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రం వెల్లడించింది. భూమికి కేవలం 8 కిలో మీటర్ల లోతున కేంద్రీకృతమైన భూ కంపం ధాటికి లీజౌనగరంలో దాదాపు 13 భారీ భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
భూకంప ప్రభావంతో లీజౌ నగరం నుంచి సుమారు 7,000 మందికి పైగాప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా స్థలంలో 51అత్యవసర వాహనాలు, 300 మందికి పైగా సిబ్బందితో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైల్వే లైన్‌ల పటిష్టతను పరిశీలిస్తున్న తరుణంలో రవాణాకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అయితే, ప్రభావిత ప్రాంతంలో కమ్యూనికేషన్, విద్యుత్, నీరు, గ్యాస్ సరఫరా వంటి నిత్యావసర సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయని చైనా (China) మీడియా స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం (Earthquake) ఇదేనని అధికారులు పేర్కొన్నారు.
Read Also: మహిళలు పిల్లలు కనే మిషిన్లు కాదు.. చంద్రబాబుకు కిరణ్ బేడీ కౌంటర్
Follow Us On: WhatsApp

