కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో రెండు రోజులలో ఇద్దరు కానిస్టేబుళ్లు గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. విధులలో ఉన్న సమయంలోనే ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా, మరొక కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మోపాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ సోమవారం విధుల్లో ఉన్న సమయంలోనే గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
అదే ఉమ్మడి జిల్లాలో మరో ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రఘు (44) సోమవారం రాత్రి డ్యూటీ పూర్తి చేసి మంగళవారం ఉదయం స్వగ్రామమైన బాన్సువాడకు చేరుకున్నారు. అనంతరం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రఘుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్రంగా కలిచివేసింది. పోలీస్ శాఖ అధికారులు మహేందర్, ఆంజనేయులు సహా సిబ్బంది ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రెండు రోజులలో వరుసగా ఇద్దరు కానిస్టేబుళ్లు గుండెపోటుతో మృతి చెందడం పోలీస్ శాఖలో ఆందోళన కలిగిస్తోంది.

