కలం, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ మాజీ సహ యజమాని రాజ్ కుంద్రా (Raj Kundra) మరోసారి వార్తల్లో నిలిచారు. తన షేర్ల అసలు విలువను దాచిపెట్టి తక్కువ మొత్తానికి రాజీకి ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ, ప్రస్తుత సహ యజమాని మనోజ్ బడాలే, ఆయన సంస్థ ఎమర్జింగ్ మీడియా వెంచర్స్‌పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో పిటిషన్ దాఖలు చేశారు. 2009లో రాజస్థాన్ రాయల్స్ 2008 ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం రాజ్ కుంద్రా ఆ ఫ్రాంచైజీలో 11.7 శాతం వాటాను కొనుగోలు చేశారు. అయితే 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో ఆయనను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం 2015లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆయనపై క్రికెట్‌కు సంబంధించిన కార్యకలాపాలలో జీవితకాల నిషేధం విధించింది. దీంతో ఆయన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నుంచి తప్పుకున్నారు.
ఇటీవల ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్టు కూడా రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఎమర్జింగ్ మీడియా వెంచర్స్‌కు 49.4 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించడంతో పాటు, రాజస్థాన్ రాయల్స్‌లో తన మాజీ వాటాకు సంబంధించి భారత్‌లో న్యాయపరమైన చర్యలు కొనసాగించకుండా శాశ్వత ఆంక్షలు విధించింది. అయితే తాజాగా రాజ్ కుంద్రా కొత్త పిటిషన్‌తో ముందుకు వచ్చారు. తన షేర్ల విక్రయానికి సంబంధించిన అసలు విలువను తనకు తెలియకుండా దాచారని, తుది విలువ కంటే చాలా తక్కువ మొత్తానికి రాజీ పడేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముంబై ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేసినట్లు రాజ్ కుంద్రా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను న్యాయస్థానం ముందు సమర్పిస్తానని, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
అలాగే ఈ అంశంపై బీసీసీఐకి కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్ తొలి బిడ్‌కు సంబంధించిన పెట్టుబడులపై సందేహాలు కలిగించే పత్రాలు, ఆధారాలను అందజేసినట్లు తెలిపారు. వాటిపై స్వతంత్ర విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. తన షేర్ల అసలు విక్రయ విలువను దాచిపెట్టి తక్కువ మొత్తానికి ఒప్పించే ప్రయత్నం జరిగిందని ఆధారాలు చూపిస్తున్నాయని రాజ్ కుంద్రా పేర్కొన్నారు. ఈ ఆధారాలను విచారణ సంస్థలు, న్యాయస్థానాల ముందు ఉంచుతానన్నారు. ఇదిలా ఉండగా, రాజస్థాన్ రాయల్స్‌లో తన మెజారిటీ వాటాను మనోజ్ బడాలే ఈ ఏడాది ప్రారంభంలో విక్రయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అలాగే ఆదర్ పూనావాలా కలిసి సుమారు 1.65 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువతో రాజస్థాన్ రాయల్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు.

