కలం, వెబ్‌డెస్క్: అల్వారో రోబుల్స్ అద్భుత ప్రదర్శనతో డెంపో గోవా ఛాలెంజర్స్ (Dempo Goa Challengers) అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (UTT) సీజన్ 7 ఫైనల్లోకి అడుగుపెట్టింది. పనాజీలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్ దబాంగ్ ఢిల్లీ TTC ని 8-2తో ఓడించి, ఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే గోవా ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ ఒలింపియన్ అల్వారో రోబుల్స్ 3-0తో యూసఫ్ అబ్దెల్ అజీజ్‌ను ఓడించి గోవాకు శుభారంభం అందించారు. మూడో గేమ్‌లో 7-10తో వెనుకబడినప్పటికీ, రోబుల్స్ ఊహించని రీతిలో పుంజుకుని విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో మారియా షావో 2-1తో బెర్నాడెట్ సోక్స్‌పై గెలిచి ఢిల్లీకి ఊరట నిచ్చింది.
అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో రోబుల్స్, యువ క్రీడాకారిణి సిండ్రెలా దాస్ జోడీ 3-0తో ఢిల్లీ కెప్టెన్ సతియన్ జ్ఞానశేఖరన్, మారియా షావోలను ఓడించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆఖర్లో అభినంద్ పి.బి 11-9 తేడాతో సతియన్‌ను ఓడించడంతో గోవా విజయం ఖరారైంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన తొలి జట్టుగా గోవా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో అల్వారో రోబుల్స్ ఉత్తమ విదేశీ ఆటగాడిగా, సిండ్రెలా దాస్ ఉత్తమ భారతీయ ఆటగాడిగా పురస్కారాలు అందుకున్నారు. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన డెంపో గోవా ఛాలెంజర్స్, ఇప్పుడు టైటిల్ గెలవడానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది.

