కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో భాగంగా సీఐడీ అధికారులు మమత నివాసానికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. మమతా బెనర్జీ నివాసంతోపాటు ఆ పార్టీకి చెందిన కీలకనేతల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. విపక్షనేత ఎన్నికకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కు పంపిన ప్రతిపాదన లేఖపై ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసింది.
స్పీకర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు
ఫోర్జరీ లేఖకు సంబంధించి ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సందీపన్ సహా మరికొందరు మే 27న అసెంబ్లీ స్పీకర్ రథీంద్ర బోస్‌కు ఫిర్యాదు చేశారు. మే 6న జరిగిన పార్టీ సమావేశంలో విపక్షనేత ఎన్నికపై తీర్మానం ఆమోదించలేదని.. తాము సమావేశ తీర్మాన కాపీపై మే 19న సంతకాలు చేశామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 6న చూపిన తీర్మానం ఫోర్జరీ చేసినదని పేర్కొన్నారు. 70 సంతకాలలో 14 సంతకాలు బ్లాక్ లెటర్లలో ఉన్నాయని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ వివాదం నేపథ్యంలో రితబ్రత బెనర్జీ, సందీపన్ సహాలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీఎంసీ బహిష్కరించింది.
మూడు బృందాల సోదాలు
ప్రస్తుతం మూడు సీఐడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒక బృందం ఢిల్లీలోని మమతా బెనర్జీ నివాసంలో, మరో బృందం అభిషేక్ బెనర్జీ కార్యాలయంలో మూడో బృందం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈ వ్యవహారంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తత నెలకొన్నది. సీఐడీ అధికారులు దర్యాప్తులో భాగంగా ఏయే అంశాలు సేకరించబోతున్నారు? ఈ వ్యవహారం మమతా బెనర్జీ మెడకు చుట్టుకోబోతున్నదా? అన్నది వేచి చూడాలి.

