డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి: తుమ్మల

కలం, వెబ్ డెస్క్: మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి శనివార  పర్యటించారు. మొదటగా మంత్రి తుమ్మల గత ఏడాది స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్, టెక్నాలజీని సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన డ్రోన్ ఆధారిత వివిధ వ్యవసాయ విధానాల్ని అభినందించారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తలపెట్టిన విత్తన వారోత్సవాలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. పది మంది రైతులకు వివిధ పంటలకి చెందిన నాణ్యమైన మూల విత్తనాలని పంపిణీ చేశారు.

ఆధునిక టెక్నాలజీని అందించాలి..

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేక అదునాతన టెక్నాలజీని విశ్వవిద్యాలయం రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను యూనివర్సిటీ అందించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. కొన్ని విత్తన కంపెనీల మాయ మాటలకి మోసపోకుండా రైతులు ఈ నాణ్యమైన విత్తనాలు వినియోగించాన్నారు.రైతులు మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలని అనుసరించాలన్నారు. విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు నిరంతరం రైతులతో మమేకమై వారికి కావలసిన పరిష్కారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరామ్, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ నీలిమ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డాక్టర్ వై.చంద్రమోహన్ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>