ప్ర‌భుత్వ ఆఫీసుల్లో టీవీకే శ్రేణుల త‌నిఖీలు.. టీటీవీ దిన‌క‌ర‌న్ ఆగ్ర‌హం

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఆఫీసులు, ఆస్ప‌త్రుల్లో టీవీకే (TVK) శ్రేణులు త‌నిఖీల పేరుతో అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఏఎంఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్ (TTV Dhinakaran) తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా సంక్షేమం కోసం ప‌ని చేసే ప్ర‌భుత్వ విభాగాల్లో టీవీకే నేత‌ల అధికార దుర్వినియోగం తీవ్రంగా ఖండించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెన్కాసి జిల్లాలో టీవీకే వైద్య విభాగం పేరుతో కొంద‌రు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోకి చొర‌బ‌డి త‌నిఖీలు చేశార‌ని, అలాగే జిల్లా కార్య‌ద‌ర్శి పేరుతో మ‌రికొంద‌రు సోదాలు నిర్వ‌హించార‌ని, వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తామే అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రభుత్వ అధికారులపై హుకుం జారీ చేయడం, ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు.

ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో త‌నిఖీలు చేయ‌డానికి, చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ప్ర‌త్యేక యంత్రాంగం ఉన్న‌ప్పుడు అధికార పార్టీ స‌భ్యుల‌కు ఈ హ‌క్కును ఎవ‌రు ఇచ్చార‌ని దిన‌క‌ర‌న్ ప్ర‌శ్నించారు. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో త‌ప్పు ఎవ‌రు చేసినా, చివ‌ర‌కు త‌న‌తో ఉన్న వారు చేసినా వ‌దిలిపెట్ట‌ను అని చెప్పిన విజ‌య్ ఈ రోజు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న త‌న పార్టీ శ్రేణుల‌పై ఎందుకు చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని నిల‌దీశారు. విజ‌య్ సీఎం అయిన‌ప్ప‌టి నుంచి సీఎం ఛాంబ‌ర్‌తో స‌హా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప్ర‌జ‌లు గుమిగూడే సినిమా షూటింగ్ స్పాట్‌లా అయిపోయాయ‌ని, ప్ర‌జ‌లే స్వ‌యంగా విమ‌ర్శిస్తున్నార‌ని దిన‌క‌ర‌న్ ఎద్దేవా చేశారు.

అధికార పార్టీ శ్రేణులు, అభిమానుల ముసుగులో సీఎం ఛాంబ‌ర్‌లో జ‌రిగే చ‌ర్చ‌ల‌ను, సీఎంను పొగుడుతూ ప్ర‌జ‌ల‌కు అంత‌రాయం క‌లిగించేలా ఇన్‌స్టా రీల్స్ తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ పెద్ద సాధ‌నంగా మారిపోయింద‌ని దిన‌క‌ర‌న్ విమ‌ర్శించారు. ప‌బ్లిసిటీ వేరు అని, ప్ర‌జా సేవ వేరు అని విజ‌య్ త‌న పార్టీ శ్రేణుల‌కు అర్థ‌మ‌య్యేలా ఇప్ప‌టికైనా చెప్పుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో , బ‌హిరంగ ప్ర‌దేశాల్లో టీవీకే శ్రేణుల అధికార దుర్వినియోగాన్ని మొగ్గ‌లోనే తుంచి వేసి, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దిన‌క‌ర‌న్ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>