కలం, ఖమ్మం బ్యూరో: తల్లి గర్భంలో తొమ్మిది నెలలు సురక్షితంగా పెరిగి, ఈ లోకాన్ని చూడాల్సిన ఆ పసి ప్రాణాలు నెలలు నిండకముందే రోడ్డు పక్కన చెత్త కుప్పల్లోనో, శ్మశాన వాటికల బాత్రూమ్‌లలోనో విగతజీవులుగా తేలుతున్నాయి. భద్రాద్రి (Bhadradri) జిల్లాలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జరిగిన రెండు అమానుష ఘటనలు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, మన సమాజం ఎటు వైపు వెళ్తుందనే ఆందోళనను రేకెత్తిస్తోంది.
మణుగూరు మండలం గట్టుమల్లారం గ్రామంలోని శ్మశాన వాటికలో కాటికాపరిగా పని చేస్తున్న లక్ష్మీపతి.. ప్రతిరోజూలాగే తన విధుల్లో భాగంగా బాత్రూమ్‌లు శుభ్రం చేసేందుకు వెళ్లాడు. అక్కడ పూర్తిగా అవయవాలు కూడా ఏర్పడని ఓ పసి ఆడ శిశువు మృతదేహం కనిపించడంతో ఆయన నిర్ఘాంతపోయాడు. కఠినమైన శ్మశాన వాతావరణంలో రోజూ శవాలను చూసే కాటికాపరి గుండె కూడా ఆ పసిపాపను చూసి తల్లడిల్లిపోయింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఘటన మరువక ముందే.. పాల్వంచ పరిధిలోని బొల్లోరిగూడెంలో మే 13న మరో ఘోరం వెలుగుచూసింది. రహదారి వెంట ఒక నవజాత శిశువు మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతింటుండగా, మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స్థానికులు చూసి గుండెలు బాదుకున్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించే సమయానికి అక్కడ కేవలం తల భాగం మాత్రమే మిగిలింది. ఆ అవశేషాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నతల్లే కాదనుకున్నా.. కనీసం మట్టిలో కలిసే భాగ్యం కూడా ఆ జీవికి లేకుండా పోయింది.ఈ రెండు ఘటనల్లోనూ బలైనవి ఆడ శిశువులే కావడం గమనార్హం.
ఈ సంఘటనలకు సంబంధించి జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం స్కానింగ్ సెంటర్లు, భ్రూణహత్యలపై నిఘా తీవ్రం చేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతుండగా, మరోపక్క ప్రేమ పేరిట మోసపోయిన యువతులు, బాలికలు సమాజానికి భయపడి రహస్యంగా గర్భస్రావం చేసుకుంటున్నారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ఎందుకంటే గత ఫిబ్రవరి 27న పాల్వంచలోనే ఓ విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ బాత్‌రూమ్‌లోనే మృతశిశువుకు జన్మనిచ్చిన ఉదంతమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అబార్షన్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే ఆ గర్భస్రావం జరిగిందని పోలీసు విచారణలో తేలింది.
ఇవన్నీ గమనిస్తే అవాంఛిత గర్భాల వల్ల తల్లులు పడుతున్న మానసిక వేదన, ఆపై జరుగుతున్న ఘోరాలు స్పష్టమవుతున్నాయి.మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవాంఛిత గర్భాల వల్ల కావచ్చు, లేదా ఆడపిల్ల అనే వివక్ష వల్ల కావచ్చు.. ఏదేమైనప్పటికీ నెలలు నిండకముందే పసిప్రాణాలు వీధులపాలవుతుండటం కలిచివేస్తోంది. ఇలాంటి హృదయవిదారక సంఘటనలను అరికట్టడానికి ప్రభుత్వం భ్రూణహత్యల నివారణ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు సమాజంలో ఆడ, మగ ఇద్దరూ సమానమే అనే భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అలాగే బాలికలు, యువతులు అవాంఛిత గర్భాల బారిన పడకుండా ప్రభుత్వ విద్యా, ఆరోగ్య సంస్థల ద్వారా తగిన జాగ్రత్తలు, అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, పసిపాపలను ఇలా నిర్దయగా వీధి పాలు చేస్తున్న కసాయిలను సీసీటీవీల ఆధారంగా విచారించి, కనిపెట్టి వారికి కఠిన శిక్షలు విధిస్తేనే ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. పసిపాపల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ క్రూరత్వానికి ఇకనైనా చరమగీతం పాడకపోతే.. మానవత్వానికి మనుగడ ఉండదని మేధావులు హెచ్చరిస్తున్నారు.
జాడి చొక్కా రావు, న్యాయవాది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి మోసం చేస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం 10 ఏళ్ల వరకూ జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మహిళకు ఇష్టం లేకుండా గర్భస్రావం చేస్తే బీఎన్ఎస్ 88,89,90 సెక్షన్ల ప్రకారం పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి 3 నుంచి 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష, ఐదు నుంచి పది లక్షల వరకూ జరిమానా విధిస్తారు.

