కలం, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రంలోని కాలినడక మార్గాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాల సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో అడవి జంతువులు తరచూ భక్తులపై దాడులు చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిరుతలువస్తున్నాయని, ఇది ప్రమాదకరంగా మారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ (TTD) అలర్ట్ అయ్యింది. భక్తులను గుంపులుగా పంపడం, చేతి కర్రలు పంపిణీ చేయడం లాంటి చర్యలు చేపట్టింది. అయినా జంతువుల సంచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి కీలక చర్యలు చేపట్టింది.
అలిపిరి లాంటి నడక మార్గాల్లో జంతువుల (Leopard) సంచారం పెరిగిన నేపథ్యంలో భక్తులకు భరోసా కల్పించేందుకు టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించింది. జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు మార్గమధ్యంలో ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించింది. ఈ కెమెరాలను నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతోంది. టీటీడీ తీసుకున్న ఈ పటిష్టమైన చర్యల వల్ల భక్తులు ఆందోళన చెందకుండా సురక్షితంగా శ్రీవారిని దర్శించుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.

