కాంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు..

కలం, వెబ్​ డెస్క్​ : అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాతో చేతులు కలిపి, అమాయక భారతీయ పౌరుల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న సైబర్​ ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్బి) (Telangana Cyber Security Bureau) ఛేదించింది. డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాంబోడియా కేంద్రంగా సాగుతున్న సైబర్ ఫ్రాడ్ సిండికేట్‌తో సంబంధాలు కలిగి ఉండి, వారికి అక్రమంగా సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ (29), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ (30), సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్‌తో పాటు హన్మకొండలోని ఎయిర్‌టెల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ టీమ్ లీడర్ నూనె అశోక్ ఉన్నారు. గత నెల 31వ తేదీన శంషాబాద్ విమానాశ్రయం నుంచి 198 భారతీయ సిమ్ కార్డులతో కాంబోడియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అష్రఫ్ అలీని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోగా, ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు.

ముఠా కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయగా, 2023 నుంచి ఇప్పటివరకు ఆరు వేర్వేరు విడతల్లో సుమారు 600కు పైగా సిమ్ కార్డులను అక్రమంగా విదేశాలకు తరలించినట్లు తేలిందని శిఖా గోయల్ వెల్లడించారు. నిందితుడు అష్రఫ్ 2023లో దుబాయ్‌లో హోటల్ పనిచేస్తున్న సమయంలో, రిజ్వాన్‌తో పరిచయం ఏర్పడిందని, భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేస్తే భారీగా డబ్బు ఇస్తామని అతను ఆశ చూపినట్లు పేర్కొన్నారు. దీంతో అష్రఫ్ స్థానిక పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్ల సహాయంతో అమాయకుల వ్యక్తిగత పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించడం ప్రారంభించాడు. అరెస్టయిన సోహైల్ జియోలో ప్రమోటర్‌గా, అతీక్, అశోక్ ఎయిర్‌టెల్ ఏజెంట్లుగా ఉంటూ తమకున్న అధికారంతో నకిలీ పత్రాల ద్వారా ఈ కార్డులను యాక్టివేట్ చేసి సరఫరా చేస్తున్నారని Telangana Cyber Security Bureau డైరెక్టర్​ శిఖా గోయెల్​ స్పష్టం చేశారు.

ఈ అక్రమ సిమ్ కార్డులను కాంబోడియాలోని నేరగాళ్లు ఫిషింగ్, గుర్తింపు దొంగతనం, బెదిరింపులు వంటి నేరాలకు వాడుతూ భారతీయ పౌరులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారని శిఖా గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కొరియర్‌గా వ్యవహరిస్తున్న అరవింద్ కుమార్ అలియాస్ షాహిద్ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు విదేశాల నుంచి ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న మాస్టర్ మైండ్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని, నిందితులపై కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ‘సంచార్ సాథి’ వెబ్‌సైట్ ద్వారా తమ పేరిట ఉన్న సిమ్ కార్డుల వివరాలను తనిఖీ చేసుకుని, ఏవైనా అనుమానాస్పద కార్డులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>