బండి భగీరథ్ పోక్సో కేసుపై తెలంగాణ రక్షణ సేన ఆగ్రహం

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన(TRS) జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ (Hariprasad) ఆరోపించారు. మైనర్ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. సామాన్యుడికి ఒక చట్టం, కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా అని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం తెలంగాణ పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేసి, కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి, తన కుమారుడిని కాపాడేందుకు చూస్తున్నారని ఆయన అన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం చూస్తే చట్టం ఎవరికి అనుకూలంగా పనిచేస్తోందో స్పష్టమవుతోందని హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.

దేశ ప్రధాని సభలో పాల్గొన్న సమయంలో కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిందితుడికే మద్దతుగా ఉన్నాయని ఆరోపించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసులో కఠినమైన సెక్షన్‌లు  నమోదు చేయకుండా సాధారణ సెక్షన్‌లతో సరిపెట్టారని ఆయన విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ మధ్య ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని, కేసును పారదర్శకంగా విచారించాలని తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>