కలం, వెబ్ డెస్క్: షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) అన్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడం అదృష్టకరమని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం పరిధిలోని కైలాష్ హిల్స్, ఈవెంటురెన్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మల్కాజిగిరి పరిశీలించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఫ్లాట్ నంబర్ 201 పూర్తిగా దగ్ధమవ్వగా, దాని పైన, కిందున్న ఫ్లాట్ కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన ఫ్లాట్లను ఎంపీ పరిశీలించి, బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అగ్నిప్రమాద ఘటనలో 201 ఫ్లాట్ లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయని ఈటల అన్నారు. అగ్నిప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్ నిర్మాణ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని, దీనిపై ‘స్ట్రక్చరల్ అసెస్మెంట్’ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవనం ఎంతవరకు సురక్షితం? భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల నివేదిక అవసరమని పేర్కొన్నారు. ఈరోజే హౌసింగ్ మినిష్టర్ తో జరగనున్న సమావేశంలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, స్ట్రక్చరల్ ఇంజనీర్లతో భవనాన్ని తనిఖీ చేయించి, బాధితులను ఆదుకోవాలని కోరుతామని హామీ ఇచ్చారు. అపార్ట్ మెంట్ వాసులకు అండగా ఉంటామని, నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం సాధ్యమైనంత సాయం అందేలా చూస్తామని ఈటల భరోసా ఇచ్చారు.

