కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉదండాపూర్ (Udandapur) రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) పనులను వేగంగా పూర్తిచేసి నిర్వాసిత కుటుంబాలను ఆదుకుంటామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. వీలైనంత త్వరగా బాధితులను పునరావాస కాలనీలోకి తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి కలెక్టర్ సంబంధితశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదండాపూర్, వల్లూరు గ్రామాలతోపాటు చిన్నగుట్ట తండా, రేగడిపట్టె, తండా తుమ్మలకుంట తండా, శామగడ్డ తండా, పోలేపల్లి హామ్లెట్ల నిర్వాసితులకు సంబంధించిన పునరావాస పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ పునరావాసకాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించండి
ఆలయ నిర్మాణ పనులకు ఎండోమెంట్‌శాఖ నుంచి అవసరమైన డిజైన్ అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, అంతర్గత రహదారులు, విద్యుత్ సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పునరావాస కాలనీలో అన్ని సౌకర్యాలు సిద్ధం చేసి నిర్వాసితులు తమకు కేటాయించిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి చిన్నచిన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని ఆదేశించారు.
బ్యాంకు రుణం ఏర్పాటు చేయాలి
ఇండ్ల నిర్మాణ అనుమతులు, నిర్వాసితులతో అవసరమైన వారికి బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందే వీలుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఉదండపూర్ ఆర్&ఆర్ కాలనీలో దేవాలయ నిర్మాణ పనులను దేవాదాయ శాఖ అనుమతులు తెప్పించుకొని త్వరితగతిన ప్రారంభించాలని, అనంతరం నిర్వాసితులకు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం మూలంగా మిగిలిన వ్యవసాయ భూములకు వెళ్లడానికి బండ్ల బాటలు వేయవలసిందిగా ఎమ్మెల్యే కోరగా ఇట్టి విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించవలసిందిగా కలెక్టర్ జడ్చర్ల తాసిల్దార్ ను ఆదేశించారు.
అన్ని ఫైళ్లను క్లియర్ చేయాలి
అనంతరం వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను సమీక్షించిన కలెక్టర్, వచ్చే పది రోజుల్లో అన్ని ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని సూచించారు. జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, సంబంధిత ఆర్‌డీఓలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూములను రక్షించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యలపై సమీక్ష
వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌లలో ఎక్కడైనా లీకేజీలు, దెబ్బతిన్న ప్రాంతాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇంజినీర్లకు సూచించారు. నీటి సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా లేదా బోర్‌వెల్‌ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చిన్నచిన్న సమస్యల కారణంగా పనులు పెండింగ్‌లో ఉంచకుండా సమస్య పరిష్కార దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
నిర్వాసితులను ఆదుకోండి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో వారికి అందాల్సిన పరిహారం నిధులు జమ చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కుటుంబం కూడా పునరావాస కాలనీలోకి వెళ్లకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి నిర్వాసితులను కాలనీలోకి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరహాలో ప్లాట్లను లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తే వారు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తారని సూచించారు.
మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి
రోడ్లు, ఆలయాలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలలు, మిషన్ భగీరథ పైప్‌లైన్‌లు, విద్యుత్ సదుపాయాలు వంటి పెండింగ్ మౌలిక వసతుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్లాట్ల కేటాయింపులు, పరిహార చెల్లింపుల విషయంలో వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. పునరావాస కాలనీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను నాగసాలకు తరలిస్తే నిర్వాసితులు కాలనీలోకి రావడానికి ఆసక్తి చూపుతారని సూచించారు. జడ్చర్ల మండలం, మున్సిపాలిటీలో తాగునీటి సమస్యపై మాట్లాడుతూ, వేసవిలో ప్రస్తుత సరఫరా సరిపోవడం లేదని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఆక్రమణలు, వాటిపై రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ జరపాలని కోరారు. బాలానగర్ మండలంలో వాగు ఆక్రమణ చేసి మళ్లించిన ఘటనపై కూడా విచారణ జరపాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ, డీఆర్‌వో రామ్‌రెడ్డి, ఆర్డీవో నవీన్, భూ రికార్డుల సర్వే అధికారి ఎడీ అశోక్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఈఈలు, డీఈలు, ఉదండపూర్, వల్లూరు సర్పంచులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

