కలం, భూపాలపల్లి : భూపాలపల్లిలో మొదటి జెండా ఎగురవేశామని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను నమ్ముకొని పార్టీ పెట్టానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. నిరంతరం కార్మికుల పక్షాన ఉంటానని కవిత స్పష్టం చేశారు. మే 20 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్న జెండా పండుగలో భాగంగా శనివారం భూపాలపల్లిలో పర్యటించిన కవిత పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.
డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇస్తున్నానని, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు. కార్మికుల గోస చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. వాళ్లు తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పి ఫ్రీ బస్ తప్ప ఒక్కటీ అమలు చేయలేదని కవిత మండిపడ్డారు. ఫ్రీ బస్ వల్ల మహిళలు గొడవ పడుతున్నారని, పురుషులకు సీట్లు లేకుండా పోయిందన్నారు. వికలాంగులకు, 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.
షాదీ ముబారక్, తులం బంగారం, కేసీఆర్ కిట్ లాంటివి ఇవ్వటంలేదని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత కూడా వసతులు రాలేదని కవిత అన్నారు. గత ఎమ్మెల్యే భూకబ్జాలు చేశారని, చెరువులు, అడవులు కూడా వదలేదని కవిత ఆరోపించారు. 190 ఎకరాల అటవీ భూమి కబ్జాపై సుప్రీంకోర్టు తెలంగాణ ఇజ్జత్ తీసిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అవే పనులు చేస్తున్నారని విమర్శించారు. ఓపెన్ కాస్ట్ కోసం 140 ఎకరాలు ఇచ్చిన ప్రజలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని కవిత (TRS Chief Kavitha) అన్నారు. భూములు ఇచ్చిన వారికి కచ్చితంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: Instagram

