కలం, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీశ్ కుమార్ పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు. బీహార్‌లోని బాంకీపుర్ (Bankipur) అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ (BJP) పరాజయం పాలైన మరుసటి రోజే ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో బాంకీపుర్ సీటు కోల్పోవడం, ఓటమికి గల కారణాలు, ఎన్డీయే తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నితీశ్ కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా కూడా ప్రధానమంత్రిని కలిశారు. అనంతరం పీఎం ఆఫీస్ ‘ఎక్స్’లో ఈ సమావేశం గురించి వెల్లడించింది. కానీ.. సమావేశంలో ఏం చర్చించారనేది మాత్రం బయటికి ప్రకటించలేదు. మరోవైపు, తాను ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు నితీశ్ కుమార్ తెలిపారు.
బాంకీపుర్ నియోజకవర్గాన్ని బీజేపీకి బలమైన స్థావరంగా చెప్పేవాళ్లు. నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన ఆ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ 19,324 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం బీహార్‌లో బీజేపీ–జేడీయూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నితీశ్ కుమార్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, అనంతరం తొలిసారిగా బీజేపీ నాయకుడు సమ్రాట్ చౌదరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామాల మధ్య బాంకీపుర్‌లో బీజేపీ ఓటమి, ఆ వెంటనే నితీశ్ కుమార్ ప్రధాని మోదీతో సమావేశం కావడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ భేటీలో చర్చించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

