కలం, ఖమ్మం బ్యూరో: అంతరాష్ట్ర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ (ఆర్ఎన్సీసీ) బృందం విరుచుకుపడింది. ఒడిస్సా నుంచి కర్ణాటకకు భారీగా గంజాయి తరలిస్తున్న వ్యవస్థీకృత ముఠా గుట్టును చాకచక్యంగా రట్టు చేసింది. ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై నిర్వహించిన ఈ కీలక ఆపరేషన్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల ఎండు గంజాయి (Ganja) తో పాటు ఒక వ్యాను, కారు, బైక్‌లను ఈగల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం (Seizure) చేసుకున్నారు.
ఒడిస్సా నుంచి కర్ణాటకకు వాహనాల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందం జాతీయ రహదారిపై వాహనాలను వెంటాడింది. కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ప్రాంతంలో వాహనాలను చాకచక్యంగా అడ్డుకట్ట వేసి ముగ్గురు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుంది. తదుపరి సమగ్ర దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న వాహనాలు, సరుకుతో పాటు నిందితులను కూసుమంచి పోలీసులకు అప్పగించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిస్సాకు చెందిన డోన్డు అలియాస్ రాజు, కొర్ర లోకోన్, బురిడీ సీతారాం, అమ్లంగీ లైసాన్ అనే వ్యక్తులు కలిసి ఈ అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠాను ఏర్పాటు చేశారు. డోన్డు నాయకత్వంలో గంజాయి కొనుగోలు, రవాణా, పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఒడిస్సాలోని జాన్బా ప్రాంతంలో సేకరించిన 400 కిలోల ఎండు గంజాయిని కిలోకు రూ. 2,500 చొప్పున విక్రయించేలా కర్ణాటకకు చెందిన ఎం. నాగరాజు, మనోజ్‌లతో డోన్డు ఒప్పందం కుదుర్చుకుని తరలింపు చేపట్టాడు.
పోలీసుల కంట పడకుండా ఉండేందుకు ముఠా సభ్యులు వేర్వేరు వాహనాలను వినియోగించారు. ప్రధాన వాహనాల కంటే ముందే పోలీసుల కదలికలను కనిపెట్టేందుకు బైక్‌పై వచ్చిన ఖిలో లక్ష్మణ్, బొలెరో వాహన డ్రైవర్ వంతల గోపినాథ్, మరో వాహనదారుడు ఎం. నాగరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని మిగిలిన సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కూసుమంచి అదనపు ఎస్సై దివ్య శ్రీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

