మండల కేంద్రాల్లో ప్రజావాణి.. నోడల్ అధికారిగా ఎంపీడీవో

కలం, తెలంగాణ బ్యూరో: ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలపై జీవో నెంబర్ 4ను జారీ చేసింది. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘మండల ప్రజావాణి (Mandal Prajavani)’ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో జరుగుతుంది. మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, నమోదు, పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించేందుకు వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా ‘మండల ప్రజావాణి’కి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, మండల విద్యాధికారి, వైద్యాధికారి,ఐసిడిసి అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కేంద్రాల్లో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్‌తో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

తాగునీరు, కూర్చునే సౌకర్యం, మరుగుదొడ్లు, వీల్‌చైర్ వంటి వసతులు కల్పించాలని.. ఫిర్యాదు రాయలేని వారికి సహాయం అందించాలని సూచించింది. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆన్‌లైన్‌లో అప్లోడ్..

మండల ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుదారుల పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడంతో పాటు ఫిర్యాదు వివరాలు, గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదును అందించాలని తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>