కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెల (Power Sector Strikes) పై నిషేధాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించారు. టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కోతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని సేవల్లో ఎలాంటి సమ్మెలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం వ్యవస్థల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంధన శాఖ పేర్కొంది.
విద్యుత్ రంగం అత్యవసర సేవల పరిధిలోకి వస్తుందని.. సమ్మెల కారణంగా ప్రజా జీవనం, పారిశ్రామిక కార్యకలాపాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ అత్యవసర సేవల నిర్వహణ చట్టం–1971 (ఎస్మా)లోని సెక్షన్ 3(1), 3(3) కింద ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలను వినియోగిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా ప్రకారం అత్యవసర సేవలుగా గుర్తించిన రంగాల్లో సమ్మెలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. విద్యుత్ రంగం ప్రజా జీవితంతో నేరుగా ముడిపడి ఉన్నందున, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం వచ్చినా దాని ప్రభావం విస్తృతంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

