కలం, ఖమ్మం బ్యూరో : సుమారు 360 ఏళ్ల కింద భక్త రామదాసు నిర్మించిన భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం మరోసారి మహా వైభవాన్ని సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్ల వ్యయంతో ఆలయ సమగ్ర విస్తరణ, పునర్నిర్మాణ పనులను చేపట్టింది. దక్షిణ భారత్ లో అత్యంత ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా, ‘దక్షిణ అయోధ్య’ గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రాన్ని భవిష్యత్ తరాలకు మరింత వైభవంగా అందించాలనే లక్ష్యంతో అధికారులు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు స్థానిక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో నిత్యపూజలు, గర్భగుడిలో మూలవిరాట్ దర్శనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ప్రాకారాల విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి, పుష్కరాలే లక్ష్యం..
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆలయానికి నాలుగు వైపులా విశాలమైన మాడవీధుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 72 ఉపాలయాలు, తాత్కాలిక షెడ్ల తొలగింపు పూర్తయింది. రాబోయే ముక్కోటి ఏకాదశి నాటికి కొత్త ఉత్తర ద్వారాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 44 ఏళ్లుగా ఉన్న పాత మెట్ల స్థానంలో కొత్త మెట్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి మొదటి దశ విస్తరణ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా ఆలయం నుంచి గోదావరి ఘాట్ వరకు రోడ్డు విస్తరణ, విశాలమైన పాదబాటలు, ఆధునిక డ్రైనేజీ, పారిశుద్ధ్య సదుపాయాలు, విద్యుత్ వెలుగులు, తాగునీటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణ మాడవీధి విస్తరణకు అడ్డుగా ఉన్న ఇళ్లు, షాపుల నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం చెల్లించి స్థలాలను స్వాధీనం చేసుకుంది.
వారసత్వానికి భంగం లేకుండా నిర్మాణాలు
ఆలయ విస్తరణలో ప్రాచీన వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. 1967లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ శంకుస్థాపన చేసిన చిత్రకూట మండపం తొలగింపు సందర్భంగా లభించిన పురాతన రాతి స్తంభాలు, శిల్ప సంపదను ప్రత్యేక జాగ్రత్తలతో భద్రపరుస్తున్నారు. ప్రతి రాతి స్తంభానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించి, నిపుణుల పర్యవేక్షణలో భద్రంగా నిల్వ చేస్తున్నారు. మంగళవారం కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, డ్రాయింగ్స్, పనుల పురోగతిని సమీక్షించారు. పనుల పర్యవేక్షణ కోసం రోడ్లు-భవనాల శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆధ్యాత్మికతకు ఆధునిక రూపం
నిజాం పాలనలో తానిషా హయాంలో భక్త రామదాసు నిర్మించిన భద్రాచల ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అదే ఆలయ ప్రాచీనత, ఆధ్యాత్మిక విశిష్టతకు ఎలాంటి భంగం కలగకుండా ఆధునిక వసతులతో సమగ్ర అభివృద్ధి చేపడుతున్న ప్రభుత్వ చర్యలను భక్తులు స్వాగతిస్తున్నారు. గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి మరింత వైభవంగా రూపుదిద్దుకుని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించే మహాక్షేత్రంగా అవతరించనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

