కలం, వెబ్ డెస్క్ : స్త్రీ నిధి (Stree Nidhi) సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటు అందించాల్సి స్త్రీ నిధి సంస్థ (Stree Nidhi) అక్రమార్కులకు అడ్డగా మారిందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో సంస్థ ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్ట్ కొట్టేయడానికి ఎండీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. రిటైర్ అయి 14 సంవత్సరాలు గడుస్తున్నా సంస్థను గుత్తాధిపత్యంలో పెట్టుకుని ఇప్పుడు చైర్మన్ పదవి కొట్టేయడానికి స్కెచ్ వేశారన్నారు.
ఈ నెల 23వ తేదీతో సంస్థ ఎండీగా కాలపరిమితి ముగుస్తుండడంతో ఎలాగైనా సంస్థను తన ఆధీనంలో పెట్టుకోవడానికి ఎండీ ప్రయత్నాలు మొదలు పెట్టాడని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్తం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అక్రమార్కులకు కీలక పోస్టుల్లో కొనసాగించడం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన శాఖలో జరగుతున్న అక్రమాలపై మంత్రి సీతక్క స్పందించాలన్నారు. స్త్రీనిధిలో అక్రమాలకు కారణమైన ఎండీపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. సంస్థలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరిగేలా సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ కోరారు.

