కలం, వెబ్‌డెస్క్: కేసీఆర్ (KCR) ప్రభుత్వపైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. లెక్కలేని తనం వల్లే గత ప్రభుత్వం కుప్పకూలిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా లెక్కలేని తనంతో వ్యవహరిస్తోందని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో కూడా సీఎం రేవంత్ ఉండటం లేదని, ప్రజావాణికి సీఎం ఒకే ఒక్కసారి వచ్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌కు ప్రజలను కలిసే తీరిక ఉండటం లేదని, సెక్రటేరియట్‌కు కూడా రావటం లేదని అన్నారు. మీటింగ్‌లు అన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లేదా ఎంసీహెచ్‌ఆర్‌డీలో పెడుతున్నారని, అలాంటప్పుడు సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్లని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోరని ఆగ్రహించారు.
మరోవైపు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, మంత్రుల ఇళ్లు కానీ, మీ బంధువుల ఇళ్ల జోలికి కానీ హైడ్రా పోవడం లేదని విమర్శించారు. బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ వెళ్లి ప్రారంభించారని, ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిందని, ఇప్పుడు దానిని ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు. బతుకమ్మ కుంటను ఎలా కాపాడతారని అడిగారు. ఏమాత్రం న్యాయం ఉందా లేదా అన్నది లేకుండా కూలగొట్టి, ప్రచారం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలా లెక్కలేనితనంతో ప్రవర్తించడం వల్లే గత ప్రభుత్వం కుప్పకూలిందని అన్నారు. ఎన్నికలు వచ్చేలోపు రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కవిత వ్యాఖ్యానించారు.

