కలం, నేషనల్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తజకిస్తాన్ సరిహద్దు దగ్గర శుక్రవారం రాత్రి 9.42 గంటల (భారత కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఏర్పడిన భూకంపం తీవ్రత ఢిల్లీ నగరంలోని ఇండ్లను తాకింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రత నమోదైంది. ఈ ప్రభావం ఢిల్లీ నగరంలోని ఇండ్లలో గణనీయంగా కనిపించింది. ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు ఊగుతుండడంతో ఢిల్లీ నగరంలోని బస్తీల్లోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. భూమి లోపల 150 కి.మీ. లోతులో భూమి పొరల్లో కదలిక వచ్చిందని, ఆ తీవ్రత 5.9గా నమోదైందని ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ సమీపంలో ఏర్పడిన భూకంపం తీవ్రత ఢిల్లీ నగరానికి మాత్రమే కాక చంఢీఘడ్, జమ్మూకశ్మీర్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపారు. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగినట్లు ఢిల్లీ నగరవాసులు తెలిపారు. నొయిడా, చండీఘడ్ నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోనివారు రాత్రి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ మీద గాజు గ్లాసుల్లోని నీరు కదలిందని, కూర్చున్న కుర్చీలు సైతం వాటంతట అవిగా కదలడంతో ఇవి భూకంపానికి సంబంధించిన ప్రకంపనలే అని అర్థమైందని చంఢీఘఢ్ నగరానికి చెందిన స్థానికులు తెలిపారు.

