కలం, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేసేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు (Sex Determination Tests) నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ చేసి, గర్భవిచ్చిత్తికి పాల్పడడం క్షమించరాని నేరమని, ఇది ఎంతో శోచనీయమని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపెక్షించకుండా, బాధ్యులపై ఎంటీపీ (MTP) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో జరిగిన గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
గట్టి నిఘా ఉంచాలి..
ఈ సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షల నిరోధానికి చేపడుతున్న చర్యల విషయమై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని నివేదికలు పరిశీలించారు. కమిటీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నామ్ కే వాస్తేగా సమావేశాలు నిర్వహించి తీర్మానాలు రాసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై క్షేత్ర స్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అన్నారు. జనన వివరాలను అనుసరిస్తూ ఆడ, మగ నిష్పత్తిలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు.
గుట్టు చప్పుడు కాకుండా చేయడంపై ఫోకస్..
ఈ తరహ వ్యత్యాసం ఎక్కువగా నగరాలు, పట్టణ ప్రాంతాలలోనే కనిపిస్తోందని, దీనిని బట్టి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోందని కలెక్టర్ (Nizamabad Collector Bhavesh Mishra) అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచితే ఈ తరహా అమానవీయ ఘటనలకు ఆస్కారం ఉండదని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, కమిటీ సభ్యులు ఎస్.సిద్దయ్య, బి.ఆంజనేయులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

