ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు..!

కలం, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) పరిధిలోని లింగాల అటవీ రేంజ్‌లో పని చేస్తున్న ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ) రాంబాబు, బీట్ ఆఫీసర్ మురళీకృష్ణలు గత నెల 23న కొంతమంది రైతుల నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. లింగాల మండలానికి చెందిన కొంతమంది రైతులు వ్యవసాయ పనిముట్ల కోసం అడవిలోకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. అటవీ అధికారుల ఒత్తిడి, భయంతో అప్పట్లో రూ.50 వేలు చెల్లించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఈ వ్యవహారంపై బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందజేశారు.

రేంజ్ కార్యాలయంలో విచారణ

బాధితుల ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం లింగాల అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఓ, బీట్ ఆఫీసర్‌లను అదుపులోకి తీసుకొని వసూళ్లకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు. అదే సమయంలో సంబంధిత అటవీ ఉద్యోగుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఆధారాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అవినీతికి పాల్పడిన ఇద్దరు అటవీ ఉద్యోగులను మహబూబ్‌న‌గ‌ర్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>