కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు (Peddur)లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దూరులోని మహాలక్ష్మి ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో పనిచేస్తున్న యువ కార్మికుడు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మంటల తీవ్రతతో ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. దుకాణంలో సుమారు రూ.40 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు యజమాని తెలిపినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

