టెస్ట్ ఓపెనింగ్‌పై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్: వరుసగా రెండోసారి అలెన్ బోర్డర్ మెడల్ గెలుచుకుని జోరు మీదున్న ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) తన టెస్ట్ ఓపెనింగ్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ టెస్ట్ షెడ్యూల్‌కు ముందు స్పందిస్తూ.. తాను సాంప్రదాయ టెస్ట్ ఓపెనర్ కానని స్పష్టం చేశాడు. గత నవంబర్‌లో యాషెస్ సిరీస్ సమయంలో ఉస్మాన్ ఖవాజా గాయపడటంతో హెడ్ తొలిసారి ఓపెనర్‌గా వచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే పెర్త్ వేదికగా కేవలం 83 బంతుల్లో 123 రన్స్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అడిలైడ్, సిడ్నీల్లో కూడా సెంచరీలు బాదాడు. మొత్తం యాషెస్ సిరీస్‌లో 629 రన్లు సాధించి ఆస్ట్రేలియాకు నమ్మకమైన ఓపెనర్‌గా మారాడు.

వారే అసలైన ఓపెనర్లు..

భారత్, శ్రీలంకల్లో ప్రత్యేక పరిస్థితుల్లో అలాగే వైట్ బాల్ క్రికెట్‌లో ట్రావిస్ హెడ్‌కు ఓపెనింగ్ చేసిన అనుభవం ఉన్నప్పటికీ, టెస్టుల్లో పూర్తిస్థాయి ఓపెనర్‌గా అతనికి ఇదే తొలి సుదీర్ఘ అవకాశం. తాను సుమారు 170 నుండి 180 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడితే, అందులో పది మ్యాచ్‌ల్లో మాత్రమే ఓపెనింగ్ చేశానని హెడ్ తెలిపాడు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జూనియర్, స్టేట్ లెవెల్ నుంచి ఓపెనింగ్ చేసేవారే అసలైన ఓపెనర్లు అని గుర్తు చేశాడు.

ఆస్ట్రేలియాకు కఠినమైన సవాళ్లు..

తన దూకుడు ఆట తీరు ఓపెనింగ్ స్థానానికి బాగా సరిపోతుందని ట్రావిస్ హెడ్ నమ్మకం వ్యక్తం చేశాడు. కొత్త బంతితో ఆడేటప్పుడు పొరపాట్లు సహజమని, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తానని అన్నాడు. ఇదిలా ఉంటే, రాబోయే 12 నెలల్లో ఆస్ట్రేలియాకు కఠినమైన సవాళ్లు ఉన్నాయి. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్, ఇంగ్లాండ్‌లతో కలిపి 20 టెస్టులు ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఉంది. ఈ బిజీ షెడ్యూల్‌లో ఓపెనర్‌గా హెడ్ ఎంతవరకు రాణిస్తాడనేది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>