కలం, స్పోర్ట్స్ : కలప జావెలిన్‌తో మొదలు.. ప్రపంచ సిల్వర్‌తో సంచలనం! మిర్జాపూర్ కుర్రాడు ఆశిష్ యాదవ్ (Ashish Yadav) యూజీన్‌లో 74.09 మీటర్ల త్రో తో అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం కొట్టాడు. జావెలిన్‌లో భారత్‌కు 2016 తర్వాత తొలి జూనియర్ ప్రపంచ పతకం. మవయ్యా గ్రామంలో ఆశిష్ సాధనకు జావెలిన్ కూడా సరిగ్గా లేదు. కలప జావెలిన్‌తోనే ప్రాక్టీస్ చేసేవాడు. ఎండిపోయిన చెరువులు. ఇసుకలో కాలు కూరుకుపోయే ప్రమాదం. అయినా లక్ష్యం మాత్రం నీరజ్ చోప్రాలా ఎదగడం.
19 ఏళ్ల వయసులో 70 కిలోల బరువు. ఆరడుగుల ఒక అంగుళం ఎత్తు. అండర్‌వెయిట్ అయినా.. కోచ్ అరవింద్ కుమార్ అతడిలో టాలెంట్ చూశారు. ట్రయల్స్‌లో 60 మీటర్లు. ఇప్పుడు 74.09 మీటర్లు. రెండేళ్లలో ఆశిష్ ఆట పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు మోకాలి గాయం. సాధనకు తక్కువ సమయం. హాంకాంగ్‌లో వీసా సమస్యలు. ఆహార ఇబ్బందులు. అక్కడ ఐదో స్థానం. అన్నింటినీ దాటి యూజీన్‌లో అదరగొట్టాడు.
ఆశిష్ 74.09 మీటర్లు విసిరాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు జాన్-హెండ్రిక్ హేమన్స్ 80.50 మీటర్లతో గోల్డ్ గెలిచాడు. అయినా ఆశిష్‌కు పూర్తి సంతృప్తి లేదు. తన వ్యక్తిగత బెస్ట్ 74.49 మీటర్లను దాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2016లో నీరజ్ 86.48 మీటర్లతో జూనియర్ ప్రపంచ రికార్డు సాధించి గోల్డ్ గెలిచాడు. ఇప్పుడు అదే వేదికపై కొత్త తరం నుంచి ఆశిష్ రజతం వచ్చింది. నీరజ్ కూడా ఆశిష్‌ను అభినందించాడు. ఈ విజయం కేవలం ఆరంభమేనని పేర్కొన్నాడు.
భారత జావెలిన్‌లో నీరజ్ ప్రభావం ఎంత ఉందో ర్యాంకింగ్స్ చెబుతున్నాయి. టాప్-20లో నీరజ్, సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ ఉన్నారు. ఆశిష్ కూడా నీరజ్ వీడియోలను చూస్తూ మెరుగవుతున్నాడు. 2024లో దక్షిణాఫ్రికాలో నీరజ్‌తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. కలప జావెలిన్‌తో మొదలైన ఈ కుర్రాడి కథ.. ఇప్పుడు ప్రపంచ రజతంతో మెరిసింది.

