ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : పొన్నం ప్రభాకర్

కలం,​ కరీంనగర్ బ్యూరో: ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుల(Public Grievances) పై ప్రాధాన్యం ఇచ్చి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర హెచ్చరిక చేశారు. శనివారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రజావాణి వినతులపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలని, ప్రజలతో అధికారులు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే సోమవారం నియోజకవర్గంలో ఏదో ఒక మండలంలో జరిగే ప్రజావాణిలో తాను స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. అలాగే, భర్తను కోల్పోయిన మహిళలకు వితంతు పెన్షన్ 15 రోజుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ​హుస్నాబాద్‌కు 5,500 ఇందిరమ్మ ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు దక్కలేదని, ప్రజాపాలన వచ్చిన ఈ రెండేళ్లలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.

అయితే, మొదటి విడతలో హుస్నాబాద్ పట్టణంలో 545 ఇళ్లకు గాను కేవలం 94 (17%) మాత్రమే పూర్తి కావడంపై మున్సిపల్ కమిషనర్‌పై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా నిర్మాణాలు అసలే ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను 10 రోజుల్లో పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.​ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని 173 గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా నియోజకవర్గంలో నూతనంగా పూర్తయిన 2,728 ఇళ్లలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

​దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాలు

రాష్ట్రంలోనే మొదటిసారిగా అలింకో ద్వారా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నవంబర్ 16 నుంచి 26 వరకు మండలాల వారీగా జరిగే ఈ పంపిణీ శిబిరాలపై గ్రామాల్లో డప్పు చాటింపులు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను పురమాయించారు. ​ఈ సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>