కలం, నిజామాబాద్ బ్యూరో: ఉపాధి వేటలో విదేశాలకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురికి దినదిన గండంగా మారింది. ఏజెంట్ మోసం చేయడంతో నలుగురు నిజామాబాద్ యువకులు (Nizamabad Youth) రష్యాలో ఇరుక్కుపోయారు. అది కూడా సైన్యంతో పాటు ఉక్రెయిన్ బార్డర్ అడవుల్లో గస్తీ కాస్తూ ఉక్రెయిన్ పై యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని స్వదేశానికి రప్పించాలని సోషల్ మీడియాలో వాట్సప్ వీడియోల ద్వారా వేడుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ కు చెందిన మహ్మద్ అప్జల్ ఖాన్, నిజామాబాద్ రూరల్ పరిధి మునిపల్లి తండాకు చెందిన భూక్యా రవీందర్, పెద్దవాల్గోట్ కు చెందిన సిర్ప అశోక్, దమ్మన్నపేట్ తండా ధర్పల్లికి చెందిన మెగావత్ ప్రకాష్ తో పాటు మరో వ్యక్తి ఉపాధి కోసం గత ఫిబ్రవరిలో రష్యా వెళ్లారు. మాస్కో లో ఆరు నెలల పాటు మెకానికల్ ఫీల్డ్ హెల్పర్ గా పనిచేశారు. పని ముగిసిందని స్వదేశం వెళ్లి పోవాలని ఏజెంట్ గంగాధర్ చేతులెత్తేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన నలుగురిని కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన తెల్లకృష్ణ రష్యన్ ఆర్మీలో గార్డెనింగ్, లోడింగ్-అన్ లోడింగ్ పనిలో చేర్పించాడు. కానీ, వారిని ఆర్మీలో సైనికులుగా చేర్చుకుని ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా బార్డర్లో ఉంచారు. ప్రతిరోజు 10 – 15కి.మీ నడక, వ్యాయామం చేయిస్తూ గన్స్ పేల్చడం, మారణాయుధాలను వినియోగించే పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. సరైన ఆహారం లేక అడవిలో బిక్కు బిక్కుమంటూ బతుకీడుస్తున్నట్టు కుటుంబీకులకు ఫోన్లు చేస్తూ విలపిస్తున్నారు.
స్వదేశానికి రప్పించాలని వేడుకోలు
బాధితుల్లో ముగ్గురు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందినవారు కావడంతో బాధిత కుటుంబాలు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆశ్రయించారు. తమవారిని ఎలాగైనా రప్పించాలని వేడుకోవడంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర విదేశాంగ మంత్రి, దౌత్య అధికారులతో మాట్లాడి తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
నా భర్తను రప్పించండి
నా భర్త మహ్మద్ అప్జల్ ఖాన్ ను ఇంటికి రప్పించాలని అతని భార్య జమీలా బేగం వాపోయారు . రష్యా సైనిక స్థావరంలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బతుకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్కడి దౌత్య అధికారులతో మాట్లాడి వెంటనే స్వదేశానికి రప్పించాలని కోరారు. వారి వీడియోలు చూసినప్పటి నుంచి నాతో పాటు మా అత్తమామ, కుటుంబసభ్యులకు నిద్రకూడా లేదని ఎమోషనల్ అయ్యారు. మా ఆయనతో పాటు చిక్కుకున్న వారిని కూడా రప్పించాలని, అందరి కుటుంబాలను ఆదుకోవాలని అంటున్నారు.

