కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వం ఒకవైపు రైతులను ఆదుకోవడానికి, ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తూ సేకరిస్తుంటే. మరోవైపు అక్రమార్కులు రెండు వైపులా ఖజానాను దోచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా అటు ఉచిత రేషన్ ‘దొడ్డు బియ్యం దందా’, ఇటు ప్రభుత్వ సన్న ధాన్యం ‘మార్ఫింగ్-రీసైక్లింగ్ దందా’ (Karimnagar Rice Scam) సమాంతరంగా సాగుతున్నాయి. వందల కోట్ల వ్యాపారం సాగుతున్నా అటు అధికారులు.. ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంలో అనుమానాలు లేవనెత్తుతున్నాయి.
జిల్లా యంత్రాంగంలో ఐఏఎస్ లు, సంబందిత అడిషనల్ కలెక్టర్ ఉన్నా సున్నితంగా తిరస్కరించడం వెనుక ఆంతర్యమేమిటో అర్దం కావడం లేదు. ఇది కేవలం కొందరు వ్యాపారులు చేస్తున్న చట్టవిరుద్ధ వ్యాపారం మాత్రమే కాదు. పౌరసరఫరాల సంస్థ , క్వాలిటీ కంట్రోల్, డిపో మేనేజర్లు, క్షేత్రస్థాయి విజిలెన్స్ యంత్రాంగం అండదండలతో నడుస్తున్న దాదాపు రూ.150 కోట్ల ‘వ్యవస్థాగత సిండికేట్’ అని ‘కలం’ లోతుగా సాగించిన పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి.
‘దొడ్డు బియ్యం’ దందా.. సరిహద్దుల రీ-సైక్లింగ్ రాకెట్
ప్రభుత్వానికి సీఎంఆర్ కింద తిరిగి ఇవ్వాల్సిన బియ్యం కోటాను పూర్తి చేయడానికి మిల్లర్లు అత్యంత దారుణమైన అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్ట్ వద్ద క్వాలిటీ లేక తిరస్కరించిన స్టాక్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి అత్యంత చౌకగా క్వింటాలు రూ.1,800 – 2,000 పాత, పురుగులు పట్టిన నాసిరకం దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. ఈ దందాలో కరీంనగర్ కు చెందిన రైస్ మిల్లుల వ్యాపారుల తండ్రి కొడుకుల హస్తం పై ఆ సంస్థలోనే ఎదుర్కోలు ఉంటోంది. దాదాపు వారి చరిత్రను యేడాదిలోపే ముగించడానికి కొందరు కంకణ బద్దులయ్యారనేది తెలుస్తోంది.
బోగస్ వేబిల్లుల మాయాజాలం
పొరుగు రాష్ట్రాల నుండి తెచ్చే ఈ బియ్యం లారీలకు నకిలీ , రీ-సైకిల్డ్ వేబిల్లులను సృష్టిస్తున్నారు. ఒకే పర్మిట్‌పై రెండు మూడేసి సార్లు లారీలను గోదాముల్లో అన్-లోడ్ చేయిస్తూ రికార్డులను మేనేజ్ చేస్తున్నారు. అన్-లోడింగ్ లంచాల ఫిక్స్డ్ రేటు: ఈ రీ-సైక్లింగ్ దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐ , సివిల్ సప్లైస్ గోదాముల్లో అన్-లోడ్ చేయించడానికి ఒక్కో లారీకి రూ.10,000 నుంచి రూ.15,000 వరకు లంచాలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా బోగస్ మాయాజాలంగా తెలుస్తోంది.
‘సన్న బియ్యం’ పాలిషింగ్ .. ప్రముఖ బ్రాండ్ల మార్కెటింగ్!
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన నాణ్యమైన సన్న ధాన్యాన్ని రికార్డుల్లో మాయం చేసి, మరోవైపు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చే రకముసుగు దందా సాగుతోంది. ‘డిజిటల్ టైమ్ గ్యాప్’తో గ్రేడ్ మార్పిడి: కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు సేకరించిన ‘A-గ్రేడ్’ సన్న ధాన్యాన్ని ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. ఈ ‘డిజిటల్ గ్యాప్’ను వాడుకుని, అధికారుల సంతకాలతో ‘A-గ్రేడ్’ సన్నాలను రికార్డుల్లో ‘కామన్ గ్రేడ్’ (దొడ్డు రకం)గా మార్చేస్తున్నారు.
రికార్డుల్లో మార్చిన అసలైన సన్న ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలు రూ. 3,500 నుంచి రూ.3,800 చొప్పున బయట అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకుంటున్నారు. పేదలకు పంచాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆధునిక పాలిషింగ్ మిషన్లలో ప్రాసెస్ చేసి సన్న బియ్యం క్వాలిటీ మాయ రూపంలోకి మారుస్తున్నారు. ఈ మార్ఫింగ్ బియ్యాన్ని ‘జై శ్రీరామ్’, హెచ్ఎంటీ, నంబర్ వన్ కర్నూల్, టమాటో గోల్డ్, జేఎస్ఆర్, కిసాన్, రాజా గోల్డ్, డబుల్ హౌస్ వంటి తదితక ప్రముఖ రైస్ బ్రాండ్ల సంచుల్లో నింపి, బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ దాడులు
ఈ రీ-సైక్లింగ్ నెట్‌వర్క్‌పై ఇటీవల కరీంనగర్ టాస్క్ ఫోర్స్ ఏసిపి సతీష్ నేతృత్వంలో జరిపిన దాడుల్లో 307 క్వింటాళ్ల ఉచిత రేషన్ బియ్యం పట్టుబడింది. రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి ‘జై శ్రీరామ్’ బ్రాండ్ తో పాటు వివిధ బ్రాండ్ల సంచుల్లో నింపి అమ్ముతున్న బండారం బయటపడటంతో, రైస్ మిల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ దందాలో ఇతర వ్యాపారులు, రైస్ మిల్లర్ల హస్తం పై విచారణ సాగిస్తున్నారు.
అధికారుల ‘సిండికేట్’..
మిల్లుల్లో ప్రతి నెలా ధాన్యం, బియ్యం నిల్వలను క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించాల్సిన ఇన్స్పెక్టర్లు, డిపో మేనేజర్లు మామూళ్లకు అలవాటుపడి ఖాళీ గోదాముల్లో నిల్వలు ఉన్నట్లు కాగితాలపై రాసేస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్ల గత రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ నిల్వలు మాయమైనా చర్యలు శూన్యం.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు వ్యాపారుల పాలు కావడం, పేదలకు పురుగులు పట్టిన బియ్యమే దక్కడంతో పాటు ఓపెన్ మార్కెట్లో కల్తీ పాలిష్ బియ్యం విక్రయించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల్లో ప్రత్యేక బృందాలతో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులైన మిల్లర్లు మరియు అధికారులపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

