కలం, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె (TGSRTC Strike) మొదలైంది. బస్సులన్నీ డిపోలే పరిమితమయ్యాయి. దాదాపు పది రోజులుగా సమ్మెపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. కార్మిక సంఘాల జేఏసీ భావిస్తున్నట్లుగానే సమ్మె ఖరారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్రంలోని సుమారు 38 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సిటీ బస్సులు మొదలు జిల్లాల సర్వీసులు, లాంగ్ డిస్టెన్స్ సేవలు సైతం నిలిచిపోవడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. మహాలక్ష్మి స్కీమ్‌తో ఇంతకాలం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు. ఇప్పుడు సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పలేదు.
కమిటీకి, జేఏసీకి మధ్య కుదరని ఏకాభిప్రాయం :
ఆర్టీసీ కార్మిక సంఘాలు అటు లేబర్ కమిషనర్‌కు, ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి పది రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చాయి. 2017 పీఆర్సీ అరియర్స్, 2021, 2025 పీఆర్సీల అమలు, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపడం, కారుణ్య నియామకాలను చేపట్టడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం.. ఇలాంటి పలు డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం ముందు ఉంచారు. కానీ పది రోజులుగా పట్టించుకోకుండా మరికొన్ని గంటల్లో సమ్మె మొదలవుతుందనగా ప్రభుత్వం ఐదుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి చర్చలకు పిలవడం చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మీడియాతో వ్యాఖ్యానించారు. కాలయాపన కోసమే కమిటీ తప్ప డిమాండ్లను పరిష్కరించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదని ఆరోపించారు. నాలుగు వారాల గడువు ఇవ్వాల్సిందిగా కమిటీ కోరిందని, కానీ ఆ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదన్నారు.
గత ప్రభుత్వంలో 52 రోజుల సమ్మె :
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేశారు. డిమాండ్ల పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా అవమానకరంగా మాట్లాడింది. సమ్మె కాలంలో 34 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత కోర్టు వరకూ వెళ్ళి చివరకు సమ్మె విరమించారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని విందు ఇచ్చిన కొన్ని హామీలు ఇచ్చారు. వరాలు కురిపించారు. కానీ ఒకటీ అరా మాత్రమే గాడిన పడ్డాయి. మిగిలినవన్నీ కాగితాలకే పరిమితమై అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇప్పుడు మరోమారు ఆ పాత డిమాండ్లతోనే సమ్మెకు దిగుతున్నారు కార్మికులు. ఒక్క డిమాండ్‌ను కూడా కమిటీ వినడానికి సిద్ధపడలేదని, ‘చెప్పింది వింటే వినండి.. లేకుంటే పొండి..’ అంటూ చర్చలు ముగియకుండానే వెళ్ళిపోయారని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు థామస్ తదితరులు మీడియాకు వివరించారు.
ఆర్టీసీ యామజాన్యానికి చిత్తశుద్ధి లేదు :
లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చామని, ఆర్టీసీ యాజమాన్యానికి సైతం పది రోజుల క్రితమే ఇచ్చామని జేఏసీ (JAC) ప్రతినిధులు గుర్తుచేశారు. సమ్మె ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే ఉండగా ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, దీంతో సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతోందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా భయపడకుండా సమ్మెకు దిగుతామని కమిటీకి స్పష్టం చేశారు. గత్యంతరం లేకనే సమ్మెకు దిగుతున్నామన్నారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. ఆర్టీసీ విభాగంలోని అన్ని కార్మిక సంఘాలకు సమ్మెలో పాల్గొనాల్సిందిగా జేఏసీ పిలుపినిచ్చింది. అన్ని డిపోల లీడర్లను సమ్మె గురించి అలర్టు చేసింది. ఒకవైపు నగరంలో సీఎన్జీ కొరత, ఇంకోవైపు పెట్రోలు బంకుల ముందు బారులు తీరిన ఆటోలతో ఇబ్బందులు ఉన్న సమయంలోనే సిటీ బస్సులు కూడా సమ్మె (TGSRTC Strike) కారణంగా డిపోలకు పరిమితం కావడం ప్రయాణికులకు మరింత ఇబ్బందికరంగా మారనున్నది.
డిపోల ముందు కార్మికుల నిరసన ప్రదర్శనలు :
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు అన్ని బస్సు డిపోల ముందు బుధవారం ఉదయం నుంచే నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్, బీఆర్ఎస్ కార్మిక విభాగం తదితర పలు కార్మిక సంఘాలన్నీ సంయుక్తంగా ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. నగరంలోని కాచిగూడ, బర్కత్‌పుర, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, ఫలక్‌నుమా, ఫారూక్‌నగర్, మిథాని, రాణిగంజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-1 (అఫ్జల్‌గంజ్) , హైదరాబాద్-2 డిపోల ముందు నిరసనలు చేపట్టనున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్ భవన్ ముందు కూడా ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రతినిధులు ఈదురు వెంకన్న, థామస్ తదితరులు తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం :
ఆర్టీసీ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మె బాట పట్టిన నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సంయుక్తంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అన్ని జిల్లాలవారీగా రవాణా శాఖ అధికారులకు ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు డ్రైవర్లు, వాహనాల వివరాలను సేకరించి వాటిని ప్రజల అవసరాలకు వినియోగించేలా మెకానిజం రూపొందించాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలను సమకూర్చుకుని అందుబాటులో ఉంచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా శాఖ దృష్టి సారించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా ప్రజలు సహకరించాలని అప్పీల్ చేసింది. ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనే మెసేజ్‌ను జనంలోకి పంపుతున్నది.
Read Also: బదిలీలకు దూరంగా లక్ష మంది
Follow Us On: WhatsApp

