రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు!

కలం, వెబ్​ డెస్క్​ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె (TGSRTC Strike)తో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కార్మికులు పలు చోట్ల డిపోల ముందే బైఠాయించి ఆందోళనలు చేపట్టడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు లేకపోవడంతో మెట్రో రైళ్లు, సెట్విన్ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు..

ఈ సమ్మె ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా పడింది. నేటి నుండే పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండటంతో, సరైన రవాణా సౌకర్యం లేక పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు, ఆటో డ్రైవర్లు అమాంతం చార్జీలు పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. అటు సెట్విన్ బస్సుల్లోనూ ధరలు పెరగడం, ఇటు ఆటోల్లో అధిక వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రయాణికుల మెట్రోబాట..

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో రోడ్లపై బస్సులు కనిపించకపోవడంతో ప్రయాణికులందరూ మెట్రో రైళ్ల వైపు మళ్లారు. ఫలితంగా నగరంలోని మెట్రో స్టేషన్లన్నీ జనసందోహంగా మారాయి. ముఖ్యంగా ఎల్బీనగర్, అమీర్‌పేట, మియాపూర్ వంటి ప్రధాన జంక్షన్లలో ప్రయాణికుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. టికెట్ కౌంటర్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తుండగా, ప్లాట్‌ఫారమ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఈ రద్దీని తట్టుకోవడానికి మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>