బదిలీలకు దూరంగా లక్ష మంది

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఇంతకాలం కొనసాగిన నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కార్ జీవో జారీచేసింది. మే నెల 1 నుంచి 31 వరకు బదిలీలు పూర్తికావాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 3.55 లక్షల మంది ఉద్యోగుల్లో అర్హులైనవారంతా బదిలీ (Employees Transfer) అవుతారు. డిపార్టుమెంటును యూనిట్‌గా తీసుకుని 40% దాటకుండా చూడాలన్న ఆంక్షలు విధించింది. ఈ జీవోతో సెన్సస్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు చిక్కులు వచ్చి పడ్డాయి. సెన్సస్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు బదిలీ కాకూడదని కేంద్ర ప్రభుత్వ నిషేధాజ్ఞలున్నాయి. ఈ విధుల్లో పాల్గొంటున్న సుమారు 96 వేల మందికి జనరల్ ట్రాన్స్‌ఫర్లు వర్తించే అవకాశాల్లేవ్. దీంతో వీరి బదిలీ సంగతేంటనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రభుత్వం నుంచీ క్లారిటీ లేదు.

ఆ తర్వాతనైనా వెసులుబాటు ఉంటుందా? :

రాష్ట్రంలో 96 వేల మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి హౌజ్ లిస్టింగ్ సెన్సస్ డేటాను మే 11 నుంచి జూన్ 9 మధ్యన సేకరిస్తారు. ఎలాంటి అవాంతరాలు, ఆటంకాల్లేకుండా సజావుగా సాగాలంటే ఆ విధుల్లో ఉన్న ఉద్యోగుల బదిలీలపై (Employees Transfer) కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు గత నెల 11న రాసిన లేఖలో స్పష్టం చేశారు. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టారాదని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజా జీవో కూడా సెన్సస్ విధుల్లోని ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నది. మొత్తం ఉద్యోగుల్లో పావు వంతుకంటే ఎక్కువ మందే బదిలీలకు నోచుకోలేని పరిస్థితి ఉత్పన్నమైంది. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మరో డ్రైవ్ చేపడుతుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొన్నది. లేదంటే వచ్చే సంవత్సరం జరిగే జనరల్ ట్రాన్స్‌ఫర్స్ వరకూ ఆగాల్సిందేనా? ఈ డైలమాకు క్లారిటీ రావాల్సి ఉన్నది.

కేంద్ర ఆదేశాలున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం :

సెన్సస్ ప్రక్రియలో భాగంగా ఆ విధుల్లో పాల్గొనే ఉద్యోగుల బదిలీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా రాష్ట్ర సర్కార్ జారీ చేసిన తాజా జీవోపై సచివాలయ వర్గాల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. కేంద్రం నిషేధాజ్ఞలు ఉన్న సంగతి తెలిసినా జీవో జారీచేయడం వెనక ఉద్దేశాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకవైపు 99 రోజుల ప్రణాళిక పనులు జరుగుతూ ఉన్న సమయంలో, వేసవి సమస్యలపై దృష్టి పెట్టే పరిస్థితుల్లో జనరల్ ట్రాన్స్‌ఫర్స్ నిర్ణయం తీసుకోవడం అంతు చిక్కలేదు. ఎవరి ఒత్తిడి పనిచేసిందనే సందేహం ఒకవైపు, సెన్సస్ విధుల్లోని ఉద్యోగులను విస్మరించడం మరోవైపు అయోమయానికి గురిచేసింది. సెన్సస్ విధుల్లో ఎక్కువగా పాల్గొనేది ఉపాధ్యాయులే అయినా ఉద్యోగులు కూడా ఉంటారనే అంశాన్ని సచివాలయ వర్గాలు గుర్తుచేశాయి. కేంద్ర నిషేధాజ్ఞలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నాయి.

దాదాపు లక్షమంది బదిలీల సంగతేంది? :

జనాభా లెక్కల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు బదిలీ అవకాశాలు వర్తించకపోవడంతో వీరి సమస్యలకు పరిష్కారమేంటన్నది కీలకంగా మారింది. ఇది అనాలోచిత చర్యేననే విమర్శలు ఎలా ఉన్నా దాదాపు పావు వంతు మందిని బదిలీ నిర్ణయానికి వెలుపల ఉంచడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం ఎలా నెరవేరుతుందన్నది పెద్ద సందేహం. సెన్సస్ విధుల్లో ఉన్నవారికి అన్యాయం జరుగుతుందన్నది నిర్వివాదాంశం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ జనరల్ ట్రాన్స్‌ఫర్స్ పాలసీ ఉనికిలోకి వచ్చింది. మళ్ళీ అవకాశం వరకు వేచి చూడాలంటే ఇంకా ఎన్ని ఏండ్లు పడుతుందో అనేది సమాధానం దొరకని ప్రశ్న. బదిలీకి అవకాశం లేకపోవడం సహజ హక్కును కోల్పోవడమేననే వాదన వినిపిస్తున్నది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇచ్చిన సూచనలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌పై నిర్ణయం తీసుకోవడం వెనక ఉద్యోగ సంఘాల నాయకుల ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ టెన్షన్.. టెన్షన్..

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>