కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్(Nizamabad) జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల(Transgender)కు సామాజిక బహిష్కరణ ఎదురవుతోంది. ట్రాన్స్ జెండర్లు గ్రామాలకు రావొద్దని కొందరు సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి కమిటీల వారు ఫ్లెక్సీలు పెడుతూ వారిని అడ్డుకుంటున్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లో ఉండే 80 మంది ట్రాన్స్ జెండర్లు కదం తొక్కారు. నిజామాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. గ్రామాభివృద్ధి కమిటీలు కొందరు సర్పంచ్‌లు గ్రామాల్లోకి హిజ్రాలు రావద్దంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం మైలారం గ్రామంలో ఇటీవల చిన్నపిల్లల్ని అపహరిస్తున్నారని భౌతిక దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిపేట్ మండలం హుస్నాపూర్‌లో అక్రమంగా గ్రామ పంచాయతీలో నిర్బంధించారని చెప్పారు. మోపాల్ మండలం సిర్పూర్‌లో హిజ్రాలు రావద్దంటూ బహిరంగంగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఈ విధమైన చర్యలతో హిజ్రాలపై సామాజిక బహిష్కరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుభకార్యాలకు వెళ్లి ఆశీర్వదించి వారికి తోచినది ఇస్తే, అదే విధంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న తమపై ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను బహిష్కరిస్తే నేడు హిజ్రాలను కూడా బహిష్కరణకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్ లపై ఇలాంటి నిర్బంధాలు, దుష్ప్రచారాలు, భౌతికదాడులు, బహిష్కరణలకు గురిచేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సామాజిక భద్రత కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలసి విన్నవించారు..
ట్రాన్స్ జెండర్ల చట్టం ఏం చెబుతోంది…?
2014 నుంచి ట్రాన్స్ జెండర్ లకు చట్టపరమైన హక్కులు ఉన్నాయి. ట్రాన్స్ జెండర్ పర్సన్ ఆక్ట్ 2019 ప్రకారం వారికి అనేక హక్కులు కల్పించారు. వివక్ష నిషేధం ప్రకారం స్కూల్, కాలేజ్, హాస్పిటల్, ఇల్లు, ఉద్యోగం, ఎక్కడైనా సరే ట్రాన్స్ జెండర్ లపై వివక్ష చూపకూడదు. ఆరు నెలల వరకూ జైలు శిక్ష విధిస్తారు. గ్రామాల్లోకి రానివ్వకపోవడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఇందుకు ట్రాన్స్ జెండర్ లు పోలీసులు ఎస్పీ కలెక్టర్ లకు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టికల్ 14 ప్రకారం వారికి అందరితో పాటు సమాన హక్కులు ఉంటాయి. 2019 చట్టం ప్రకారం వారికి రోడ్డు మీద నడిచే హక్కు, బస్సు ఎక్కే హక్కు, మార్కెట్‌లో తిరిగే హక్కు, ఇలా సాధారంగా అందరికీ ఉండే హక్కులు కల్పించారు. అడ్డుకున్న వాళ్లకే శిక్ష పడుతుంది. ట్రాన్స్ జెండర్ లను బలవంతంగా గెంటెస్తే ఆరు నెలల వరకూ జైలు శిక్ష జరిమానా కూడా పడుతుంది. ట్రాన్స్ జెండర్ లు తర్డ్ జెండర్ లు అని సుప్రీంకోర్టు 2014 లో చెప్పింది. ఈ తీర్పు ప్రకారం ఆడ, మగలకు లాగానే సమాన హక్కులు ఉన్నాయి. ఎవరైనా వేధిస్తే పోలీసు కంప్లయింట్ ఇవ్వొచ్చు.
ట్రాన్స్ జెండర్ల డిమాండ్లు ఏంటి..?
నిజామాబాద్‌లో 80 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు నిజామాబాద్ జిల్లా ట్రాన్స్ జెండర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓరుగంటి గంగా తెలిపారు. నాగారం, దుబ్బ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు చెప్పారు. శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, ప్రారంభోత్సవాలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి ఆశీర్వదించి వస్తామన్నారు. అందు కోసం పెళ్లి చేసుకున్న జంటలు శుభకార్యాలు ప్రారంభోత్సవాలు చేసుకునే వారు శుభంగా భావించి తమకు తోచినంత ఇస్తారన్నారు. గ్రామాల్లోకి రానివ్వం అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. తమకు చదువు, ఉద్యోగాలు లేవని, ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే చేసుకుంటామని చెప్పారు. రోజురోజుకూ తమపై వివక్ష పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “మేమూ మనుషులమే కదా. ఒక్క నిమిషం ఆలోచించండి. మేము ఎప్పుడూ ఏ పిల్లలనూ ఎత్తుకెళ్లలేదు. ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్లే వాళ్లమే కానీ ఇప్పటి వరకూ ఏ ట్రాన్స్ జెండర్ కూడా తప్పు చేసింది లేదు. జనాలు, సర్పంచ్ లు, గ్రామాభివృద్ధి కమిటీల వారు ఆలోచించాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సీపీ తమపై ఈ వివక్ష, సామాజిక బహిష్కరణ, భౌతిక దాడులు, గెంటివేత ఘటనలు జరగకుండా తమ హక్కులను కాపాడాలని వేడుకున్నారు.

