కలం, సూర్యాపేట: మైనర్ బాలికను రహస్యంగా వివాహం (Minor Girl Secret Marriage) చేసుకున్న కేసులో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో తీవ్ర సంచలనంగా మారింది. నమ్మదగిన సమాచారం ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికను, హుజూర్ నగర్ పట్టణానికి చెందిన నాయిని అనిల్ కుమార్ గౌడ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి వేళ రహస్యంగా వివాహం చేసుకున్నాడు. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి, బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ సదరు కానిస్టేబుల్ ఈ ఘతుకానికి ఒడిగట్టడం గమనార్హం.
ఈ బాల్య వివాహంపై సమాచారం అందుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తక్షణమే స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, పోలీస్ యంత్రాంగం ప్రాథమిక విచారణ జరిపింది. మైనర్ వివాహం (Minor Girl Secret Marriage) నిజమేనని తేలడంతో, నివేదిక ఆధారంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హుజూర్నగర్ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
సఖి సెంటర్‌లో ఏం జరిగింది..?
ప్రస్తుతం ఈ కేసులో మరో వివాదాస్పద అంశం వెలుగుచూసింది. బాధితురాలైన మైనర్ బాలికకు రక్షణ కల్పించేందుకు ఆమెను ‘సఖి’ కేంద్రానికి తరలించగా.. అక్కడ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ డ్రెస్ లో వచ్చిన ఒక మెయిల్ కానిస్టేబుల్, అలాగే ఒక ఏఎస్ఐ సఖి సెంటర్‌లోకి వెళ్లి బాలికతో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడికి లబ్ధి చేకూర్చేందుకే వీరు బాలికపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పలు కీలక ప్రశ్నలకు తావిస్తోంది.
అత్యంత భద్రత ఉండే సఖి సెంటర్లో ఉన్న మైనర్ బాలికను, సివిల్ డ్రెస్ లో ఉన్న సదరు కానిస్టేబుల్ ఎవరి అనుమతితో కలిశారు? వారిని లోపలికి అనుమతించిన సఖి సెంటర్ బాధ్యులు లేదా ఉన్నతాధికారి ఎవరు? కేసును వీరు ప్రభావితం చేయాలని చూశారా? ఈ సఖి సెంటర్ ఎపిసోడ్‌పై కూడా ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: బీర్లు.. సెలయేర్లు.. రోజుకు పాతిక లక్షల బాటిళ్ళు తాగేస్తున్నారు!
Follow Us On: X (Twitter)

