కలం, ఖమ్మం బ్యూరో: నేరస్థులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడాలంటే దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, సెషన్స్ కోర్టు లైజన్ ఆఫీసర్లు పరస్పర సమన్వయంతో పని చేయడం అత్యంత కీలకమని అడిషనల్ డీసీపీ రామానుజం (Additional DCP Ramanujam) స్పష్టం చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి న్యాయస్థానాల్లో విచారణ పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం (Khammam) పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు, శనివారం స్థానిక కోర్టు మానిటరింగ్ సిస్టమ్ కార్యాలయంలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ సమావేశం అదనపు డీసీపీ రామానుజం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టు కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాక్ష్యాధారాల సేకరణ, కేసు రికార్డుల నిర్వహణ, చార్జ్‌షీట్ల నాణ్యతతో పాటు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం అక్టోబర్ నెలలో నిందితులు నిర్దోషులుగా విడుదలైన ‘గ్రేవ్ అక్విటల్’ కేసులను అదనపు డీసీపీ కేసుల వారీగా క్షుణ్ణంగా సమీక్షించారు. నిందితులు విడుదల కావడానికి గల కారణాలు, దర్యాప్తులో జరిగిన లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణ తీరును ఆయన నిశితంగా పరిశీలించారు. కేసుల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా పక్కా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సాక్ష్యాధారాల సమర్పణలో లోపాలను పూర్తిగా నివారించడం ద్వారా నిందితులకు శిక్షలు పడే శాతాన్ని (కన్విక్షన్ రేట్) గణనీయంగా పెంచడమే డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. ఉపేందర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి.వి.డి. లక్ష్మి, ఏ. ఫణి కుమార్‌తో పాటు ఉమ్మడి జిల్లా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.

